కమ్యూనిస్టులు అంటే ఏంటో నిరూపిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హెచ్చరికలు పంపారు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అధికారం కావాలని, బీజేపీ అండదండలు కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని కూనంనేని ఫైర్ అయ్యారు.
తెలంగాణ సీపీఐ కార్యాలయంలో వామపక్షాల ఉమ్మడి సమావేశం ముగిసింది. 27న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించిన ప్లాన్ జరుగుతోంది. ఉమ్మడిగా పోటీ చేయాలని కామ్రేడ్లు నిర్ణయించారు. సీపీఐ కార్యాలయానికి వచ్చిన సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, చెరుకు సీతారామ్, జూలకంటి రంగారెడ్డిలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఏ యే స్థానాల్లో ఏయే పార్టీ అభ్యర్ధి పోటీలో వుండాలనే దానిపై దృష్టి పెట్టారు. మరోవైపు రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 27 తర్వాత మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని కేసీఆర్ కోరారని అన్నారు. బీజేపీ దూకుడుని మునుగోడులో నిలువరించాలనేది అప్పుడు తమ విధానమని కూనంనేని చెప్పారు. బీజేపీతో ఎక్కడో ఓ పాయింట్ వద్ద కేసీఆర్‌కు సఖ్యత వచ్చినట్లుగా తాము గ్రహించామని అన్నారు. బీజేపీతో ఇప్పుడు కేసీఆర్‌కు ప్రమాదం వుందా , లేదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో అప్పుడు లేని సఖ్యత ఇప్పుడు బీఆర్ఎస్‌కు వుందా అన్న ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు.
తమతో ఇప్పుడు పొత్తు పెట్టుకోనంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏం లేదని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ పార్టీలు ఎంతకాలం వుంటాయో తమకు తెలియదని.. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను మనసా వాచా నమ్మి నడుచుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రత్యేక పరిస్ధితుల్లోనే అప్పుడు బీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చామని కూనంనేని స్పష్టం చేశారు. బీజేపీకి దగ్గరయ్యుంటే కనీసం మిత్రధర్మం పాటించవా , కనీసం స్నేహధర్మం, రాజధర్మం వుండదా అని సాంబశివరావు ప్రశ్నించారు.
రాజకీయాలంటేనే మోసం అనే నిర్వచనం కేసీఆర్ ఇస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ పార్టీలతో మద్ధతుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా కేసీఆర్ నో కామెంట్ అన్నట్లుగా మాట్లాడారని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని.. లెఫ్ట్ లేకుంటే మునుగోడులో నీ పరిస్ధితి ఏమయ్యేదని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలిచుంటే ఈనాడు తెలంగాణలో పరిస్ధితి ఎలా వుండేదని కూనంనేని నిలదీశారు. మేము లెఫ్ట్ కలిసే వుంటామని కేసీఆర్ చెప్పారని.. రైతు సమస్యలపై కూడా తమతో చర్చించారని ఆయన వెల్లడించారు.
కేసీఆర్‌కి ఉత్సాహం వచ్చినప్పుడు ఫోన్‌లు చేశారని కూనంనేని ధ్వజమెత్తారు. కానీ తర్వాత ఏమైందో తమకు తెలియదని.. మునుగోడు అనే చిన్న నియోజకవర్గం తీవ్రంగా ప్రభావం చూపిందని సాంబశివరావు చెప్పారు. ఇప్పుడు వీటన్నింటిని కేసీఆర్ మార్చిపోయారని.. అయినా తమకు బాధ లేదని తెలిపారు. అధికారం కావాలని, బీజేపీ అండదండలు కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని కూనంనేని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు అంటే ఏంటో నిరూపిస్తామని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
