ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ ... చర్చించిన అంశాలివే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో మొదటిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పునర్విభజన హామీలతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు. 

Telangana CM Revanth Reddy meeting with PM  Narendra Modi AKP

హైదరాబాద్ : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పీఎంను కలిసారు రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్ర నుండి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పునర్విభన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరారు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం. ఇలా తెలంగాణ అభివృద్ది, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని... ఇందుకు కేంద్ర సహకారం అవసరమని ప్రధానితో రేవంత్ రెడ్డి అన్నారు. 

Telangana CM Revanth Reddy meeting with PM  Narendra Modi AKP

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత  కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా  రూ.450 కోట్ల చొప్పున రూ.2250 కోట్లు తెలంగాణకు విడుదల చేసిందని రేవంత్ గుర్తుచేసారు. అయితే ఇలా 2015 నుండి 2021 వరకు మాత్రమే పునర్విభజన చట్టం ప్రకారం నిధులు ఇచ్చారని... గత రెండేళ్ళుగా ఆ నిధులు ఇవ్వడంలేదని అన్నారు. అలాగే గత మూడునాలుగేళ్లుగా కేంద్రం నుండి రావాల్సిన నిధులు చాలా తగ్గాయన్నారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ గ్రాంట్స్ రూ.1800 కోట్లు వెంటనే విడుదలచేయాలని ప్రధానిని కోరారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233 కోట్లను కూడా విడుదల చేయాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసారు. 

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కల్పించాలని రేవంత్ ప్రధానిని కోరారు. పునర్విభజన చట్టంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామన్న హామీ ఇచ్చారని... తెలంగాణలో ఆ హామీ నేరవేర్చలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. 

Also Read  పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది.. తెలంగాణ ఆర్ధిక పరిస్ధితిని మోడీకి వివరించాం : భట్టి విక్రమార్క

ఇక ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగింది... వచ్చే విద్యాసంవత్సరం 2023‌-24 లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని రేవంత్ కోరారు. ఇక రాష్ట్రంలో ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని కోరారు. హైదరాబాద్ లో ఐఐఎం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని ప్రధానిని కోరారు తెలంగాణ సీఎం. 

తెలంగాణలోని 14 రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు సీఎం. కానీ కేవలం రెండింటికి మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది... మిగిలిన రహదారులను కూడా జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.

హైదరాబాద్ లో ఐటీఐఆర్ ఏర్పాటుపైనా  పీఎంతో రేవంత్ చర్చించారు. 2010 లో హైదరాబాద్, బెంగళూరులకు కేంద్రం ఐటీఐఆర్ ప్రకటించింది... కానీ 2014 లో ప్రభుత్వం మారినతర్వాత హైదరాబాద్ ఐటీఐఆర్ ను పక్కనపెట్టారని అన్నారు. వెంటనే దీన్ని పునరుద్దరించి ఐటీ అభివృద్దికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. 

ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని పీఎంను కోరారు. వరంగల్ లోని కాకతీయ మెగా జౌళి పార్కును  బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించారని.... కానీ దాన్ని గ్రీన్ ఫీల్డ్ గా మార్చాలని కోరారు. భారత సైన్యానికి సంబంధించిన కార్యాలయాన్ని పుణే నుండి సికింద్రాబాద్ కు తరలించాలని కోరారు. ఇక ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదో షెడ్యూల్ లోని ప్రభుత్వ సంస్థల విభజన,  ప‌దో షెడ్యూల్‌లోని సంస్థ‌ల అంశాల‌ను ప‌రిష్క‌రించాలని కోరారు. ఢిల్లీలోని ఉమ్మ‌డి భ‌వ‌న్ విభ‌జ‌న‌కు స‌హ‌క‌రించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios