పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది.. తెలంగాణ ఆర్ధిక పరిస్ధితిని మోడీకి వివరించాం : భట్టి విక్రమార్క
ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల భేటీ ముగిసింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల భేటీ ముగిసింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరామని.. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కేటాయించాలని మోడీని విజ్ఞప్తిని చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్‌గా పరిగణనలోనికి తీసుకోవాలని కోరామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానిని కోరామని భట్టి చెప్పారు. హైదరాబాద్‌కు ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. నీళ్లు , నిధులు నియామకాలపై గత ప్రభుత్వం తాత్సారం చేసిందని.. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరామని ఆయన తెలిపారు. కేంద్రం తరపున తెలంగాణకు సాయం చేయాలని కోరామని.. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని భట్టి ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు పెండింగ్‌లో నిధులు ఇవ్వాలని కోరామని.. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని విక్రమార్క గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు పెండింగ్‌లో నిధులు ఇవ్వాలని కోరామని భట్టి చెప్పారు. ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కోరామని.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు తొలిసారి ప్రధానిని కలిశామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వున్న సమాచారాన్ని ప్రధానికి వివరించామని.. గత ప్రభుత్వం రాష్ట్రంపై ఆర్ధిక భారం మోపిందని చురకలంటించారు.