ఈ దేశాన్ని నడిపిస్తున్న నాలుగైదు రాష్ట్రాల్లో నంబర్‌వన్ రాష్ట్రం తెలంగాణయేనన్నారు. 2014 నుంచి 19 వరకు ఐదేళ్లలో కేంద్రానికి రాజ్యాంగపరంగా లభించిన అధికారాలతో తెలంగాణ నుంచి లభించిన ఆదాయం రూ.2,72,926 కోట్లన్నారు. చట్టప్రకారం కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది రూ.1,12,854 కోట్లని కేసీఆర్ తెలిపారు.

కేంద్రం భిక్ష మీద తెలంగాణ బతుకుతుందా లేక మన భిక్షపై ఆధారపడి కేంద్రం బతుకుతుందా అని సీఎం ప్రశ్నించారు. భారతదేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనన్నారు సీఎం కేసీఆర్.

Also Read:దేశ ద్రోహులమౌతామా ?.. సీఏఏ పై అసెంబ్లీలో కేసీఆర్

సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీడీ కార్మికులను పట్టించుకున్న దాఖలాలు లేవని కేసీఆర్ ఆరోపించారు.

ఎన్నికల వాగ్థానంలో కళ్యాణ లక్ష్మీ పథకం లేదని కానీ తాము లక్షా పదహారు వేలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగానే ఉంది కాబట్టే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డైరీని సర్వనాశనం చేశారని, విజయ నెయ్యికి ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉందని దానిని శంకరగిరి మాన్యాలు పట్టించారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

పాల ఉత్పత్తి దారులకు రెండు పార్టీలు పైసా సబ్సిడీ ఇవ్వలేదని, కానీ తాము లీటరుకు 4 రూపాయలు ఇచ్చామన్నారు. రూ.30 కోట్ల అప్పుల్లో ఉన్న విజయ డైరీని లాభాల్లోకి తీసుకొచ్చామని, కామారెడ్డి జిల్లాలో భారీ మిల్క్ ప్రాసెస్ యూనిట్‌ను నెలకొల్పనున్నామని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.

Also Read:కరోనాపై అతిగాళ్లు అతి చేస్తున్నారు: మీడియాకు కేసీఆర్ వార్నింగ్

పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుకపై రూ. 40 కోట్లని, తెలంగాణ వచ్చాక ఐదేళ్లలో రూ.2,384 కోట్ల ఆదాయం సమకూరిందని సీఎం తెలిపారు. అనేక రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి కనిపించడం లేదా అని కేసీఆర్.. భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.

124 రోజులు కాకతీయ కాలువలు సజీవంగా ఉన్నాయని.. అద్భుతంగా కరెంట్ ఇస్తున్నామని, ఇది గ్రోత్ కాదా అన్నారు. తెలంగాణ సోనా షుగర్ ఫ్రీ రైస్ అని పంజాబ్‌లో మొట్టమొదటిసారిగా పండించారని, ఆ తర్వాత తెలంగాణలోనే పండిస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.