తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ పై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించిన సంగతి తెలిసిందే. కాగా నాలుగు రోజుల ముందే సమావేశాలు ముగియనున్నాయి. కాగా.. నేటి సమావేశాల్లో సీఏఏ పై చర్చను లేవదీశారు.

కాగా... ఈ నేపథ్యంలోనే సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న కేబినెట్ తీర్మానం చేసింది. దేశంలో మొదటగా సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేరళ తర్వాత సీఏఏను వ్యతిరేకిస్తూ  పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ అసెంబ్లీలు  తీర్మానం చేశాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి తెలంగాణ కూడా చేరింది.

Also Read బర్త్ సర్టిఫికెట్ ఎవరికి కావాలి..? కేసీఆర్ సీఏఏ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్...

కాగా... దీనిపై నేటి అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు. సీఏఏపై మరోసారి సమీక్ష జరిపితే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాము గుడ్డిగా సీఏఏను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా సీఏఏ విషయంలో ఆందోళనలు జరిగాయన్నారు. ఇది హిందూ, ముస్లింల సమస్య కాదన్నారు. దేశం మంచి వైపు నడవాల్సిన అవసరం ఉందన్నారు. సీఏఏని వ్యతిరేకిస్తూ దేశ ద్రోహులౌతారా అని ప్రశ్నించారు.  పార్లమెంట్ లోనూ సీఏఏ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్... భారత్ పర్యటన సమయంలో... ఈ సీఏఏ ఆందోళనలతో దాదాపు 50మంది  ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దేశంలోకి చొరబాటుదారులు రావాలని ఎవరూ చెప్పడం లేదన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు హర్షనీయం కాదన్నారు. తనకు బర్త్ సర్టిఫికేట్ లేదని.. తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.  ఓటర్ ఐడీ కార్డ్ కూడా పనిచేయదని చెబుతున్నారని.. అసలు ఇదెక్కడి పద్దతని ప్రశ్నించారు. దేశంలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వచ్చిన వారిని కాందీశికులుగా గుర్తించారని చెప్పారు.

ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని.. తాము దానిని కాదనడం లేదని స్పష్టం చేశారు,  మెక్సికో నుంచి వలసలు రాకుండా ఉండేందుకు ట్రంప్ గోడలు కడతాను అన్న విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.