పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : తేడా వస్తే నేనే ఢిల్లీ వస్తా .. బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తానే ఢిల్లీకి వస్తానని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించేలా మోడీ సర్కార్‌ను డిమాండ్ చేయాలని కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. ఎన్నికలు వేర్వేరుగా వచ్చినా, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చినా బీఆర్ఎస్‌దే విజయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తానే ఢిల్లీకి వస్తానని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కామన్ సివిల్ కోడ్ బిల్లును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
ALso Read: మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టండి.. మోడీకి కేసీఆర్ లేఖ
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ లేఖ రాశారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లులపై 2014లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి వుందని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వుంటున్న బీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్ధిక రంగాల్లో మరింత ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.