ఇరిగేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నుంచి కోదాడ వరకు నిర్మించే లిఫ్ట్ పథకాలకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. జూన్ 15 లోపు అంచనాలు పూర్తి చేయాలని సూచించారు. నెల్లికల్‌లో 15 లిఫ్ట్ ప్రాజెక్ట్‌లకు అంచనాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని కేసీఆర్ సూచించారు. జూన్ 30 నాటికి మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని.. దేవాదుల ప్రాజెక్ట్‌ను వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. కాలువల మరమ్మత్తు కోసం రూ.700 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. కాగజ్‌నగర్, బెల్లంపల్లిలో లిఫ్ట్‌కు ఆయుకట్టు సర్వే చేపట్టాలని.. వాస్కోప్ సంస్థతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read:కరోనాపై ద్విముఖ వ్యూహం: కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం అన్నారు. తాగునీటి రంగాన్ని మరింత ముందుకు నడిపించాలని.. కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖ చిత్రం మారిపోయిందని కేసీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరంతో 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నామని.. ధాన్యం దిగుబడిలో పంజాబ్ తర్వాత తెలంగాణ రెండో పెద్ద రాష్ట్రమని సీఎం అన్నారు. నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే స్థాయికి చేరామన్నారు.