ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా వుండనున్నారు. ఆ రోజున విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారనే టాక్ వినిపిస్తోంది.  

ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధినేత హోదాలో ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి సీఎం కేసీఆర్ స్వాగతం పలకాలి. అయితే గడిచిన కొద్దికాలంగా బీఆర్ఎస్ , బీజేపీల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ధాన్యం కొనుగోలు, తెలంగాణకు రావాల్సిన నిధుల నిలిపివేత, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై కేంద్ర సంస్థల దాడులు తదితర కారణాలతో కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే స్వాగత కార్యక్రమాలకు , భేటీకి దూరంగా వుంటున్నారు. తాజాగా మోడీ పర్యటనకు కేసీఆర్ దూరంగా వుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ రోజున విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే గతేడాది నవంబర్‌లో మోడీ తెలంగాణ వచ్చిన సందర్భంగా తలసాని ప్రధానికి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. 

మరోవైపు అదే రోజున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం సాక్షిగా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని చెప్పి మాట తప్పారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. లాభాల్లో ఉన్న సిగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అని ప్ర‌శ్నించారు. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు బావుల వద్ద నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాలలో మహా ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఖమ్మం బీఆర్‌ఎస్ నాయకులు భారీ నిరసనకు ప్లాన్ చేశారు. 

ALso Read: ఏప్రిల్ 8న సింగ‌రేణి ప్రాంతాల్లో మ‌హా ధ‌ర్నాలు.. కేటీఆర్ పిలుపు.. అదే రోజు హైదరాబాద్‌లో మోదీ పర్యటన..!

ఇకపోతే.. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాద్‌కు విచ్చేస్తారు. 11.30 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అనంతరం, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తారు. 11.45 గంటల కల్లా ఆయన సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అనంతరం, 11.45 నుంచి 12 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆయన ప్రారంభిస్తారు.

అనంతరం, మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌‌కు చేరుతారు. అక్కడే 1.20 గంటల వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన తిరిగి వెళ్లిపోతారు.