Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ.. కొత్తగా మతపిచ్చిగాళ్లు, నిద్రపోతే ప్రమాదమే: కేసీఆర్ వ్యాఖ్యలు

గత కొన్నిరోజులుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్ధితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని, ఇందుకోసం తన సర్వశక్తులు ధారపోస్తానని సీఎం స్పష్టం చేశారు. 

telangana cm kcr key comments on raja singh issue
Author
First Published Aug 25, 2022, 4:58 PM IST

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని, ఇందుకోసం తన సర్వశక్తులు ధారపోస్తానని కేసీఆర్ తెలిపారు. గురువారం నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కొంగర కలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. చిన్న నిర్లక్ష్యం కారణంగా 58 ఏళ్లు తెలంగాణ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని సీఎం తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో దళారీ వ్యవస్థ లేదని కేసీఆర్ వెల్లడించారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని సీఎం పేర్కొన్నారు. 

మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతామని.. తెలంగాణను కాపాడే బాధ్యత తనదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. పంటల తెలంగాణ కావాలా..? మంటల తెలంగాణ కావాలా అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం ఇన్నేళ్లలో ఒక్క మంచిపనైనా చేసిందా ..మనం మౌనంగా భరిద్దామా అని కేసీఆర్ నిలదీశారు. హైదరాబాద్‌లో 24 గంటలు కరెంట్ వుంటే ఢిల్లీలో వుండదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రధాని మనకు కావాలా అని సీఎం ప్రశ్నించారు. స్టాలిన్, మమతా బెనర్జీ ప్రభుత్వాలను కూలుస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేని కొంటామని మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. దీనిని ఇలాగే వదిలేస్తే తాను చెప్పినట్లుగా మత పిచ్చి మంటలే వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. 

ALso REad:మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. వీడియోలో చెప్పిన కాసేపటికే ఇంటికి పోలీసులు

బెంగళూరు నగరాన్ని ఎన్నో ప్రభుత్వాలు నిర్మించుకుంటూ వస్తే అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారిందని సీఎం గుర్తుచేశారు. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఆయన తెలిపారు. ఐటీ సెక్టార్‌లో హైదరాబాద్ రెండో స్థానంలో వుందని.. అయితే ఈసారి మాత్రం బెంగళూరులో తక్కువ ఉద్యోగ కల్పన జరిగిందని కేసీఆర్ వెల్లడించారు. హిజాబ్, హలాల్ అంటూ బెంగళూరులో మతపిచ్చి లేపి వాతావరణాన్ని కలుషితం చేశారని సీఎం ఆరోపించారు. తెలంగాణలోనూ పరిశ్రమలు రాకుండా వుండాలా, ఐటీ రంగం పారిపోవాలా, పిల్లలకు ఉద్యోగాలు వద్దా, రంగారెడ్డి జిల్లా భూములు పడిపోవాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు రాష్ట్రంలో మతచిచ్చు పెడుతున్నారని.. ఇలాంటి చూస్తూ ఊరుకోవాలా అని సీఎం నిలదీశారు. ఓట్లు, చిల్లర రాజకీయాల కోసం భారతీయ సమాజాన్నే గోస పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు.

నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి పదవి సరిపోదా .. ఇంకేం కావాలని సీఎం ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రశాంతంగా వున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, మంచినీటి సదుపాయం వచ్చిందన్నారు. తన బలం ప్రజలేనని ఆయన అన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు గతంలో పేర్కొన్న రూ.5 కోట్లు కాకుండా రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మత శక్తుల పిచ్చికి మనం లోనైతే మళ్లీ పాత తెలంగాణ మాదిరిగా తయారవుతామని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

పక్కనే వున్న కర్ణాటకలోకి వెళ్లి చూస్తే తెలంగాణలో వున్న పథకాలు ఏవి లేవని సీఎం అన్నారు. మనం పచ్చగా వుంటే చూడలేకే ఈ దుర్మార్గమైన చర్యలకు కాలు దువ్వుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమతో అనురాగంతో సమాజం బాగుపడుతుంది కానీ.. ద్వేషం, అసూయ, కర్ఫ్యూలతో ఎవరూ బాగుపడరని సీఎం అన్నారు. స్వార్ధ, నీచ మతపిచ్చిగాళ్లను తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మన ప్రధాన మంత్రికి చేతకాక.. ఉల్టా మాటలు మాట్లాడుతున్నాడని సీఎం మండిపడ్డారు. ఎనిమిదేళ్ల సమయం సరిపోవడం లేదా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. 100 దరఖాస్తులు ఇచ్చామని, సుప్రీంకోర్టులో కేసు వేశామని కేసీఆర్ గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios