రాజస్థాన్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణవైపుగా దూసుకొస్తున్న మిడతల దండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విపత్తుపై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ పాకిస్తాన్ మిడతల దండు రాష్ట్రంలోకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీఎం వెల్లడించారు.

మిడతలను అడ్డుకునేందుకు గాను ఫైర్ ఇంజిన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్‌లను సిద్ధంగా వుంచినట్లు తెలిపారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు తెలిపారు.

Also Read:మిడతల దండుపై పోరుకు మార్గాలు ఇవే... (చూడండి)

రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని  ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాజస్థాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండారా, గోండియా మీదుగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం వుందని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలి వాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేళ గాలి దక్షిణం వైపు మళ్లీతే ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ రాష్ట్రం వైపు వచ్చే అవకాశాలు లేకపోలేదని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

Also Read:అనంతపురంలో మిడతల దండు కలకలం

మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగు మందు పిచికారి చేయాలని కేసీఆర్ చెప్పారు.

ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు జనార్థన్ రెడ్డి, ఎస్ నర్సింగ్ రావు, జయేశ్ రంజాన్ తదితరులు హాజరయ్యారు.