తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. మోడీ కంటే మన్మోహన్ సింగే బాగా పనిచేశారని.. మన్మోహన్ కంటే మోడీ పాలనలోనే దేశం ఎక్కువగా నష్టపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఆదివారం ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లను ఏపీకి ఇచ్చారని కేసీఆర్ దుయ్యబట్టారు. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నామని ఆయన గుర్తుచేశారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని కేసీఆర్ చురకలంటించారు. ఇంత దౌర్భాగ్య పరిస్ధితి ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు. మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. మోడీ కంటే మన్మోహన్ సింగ్ ఎక్కువ పనిచేశారని.. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోడీకి ఓటేశారని ఆయన దుయ్యబట్టారు. 

పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ కంటే మోడీ పాలనలోనే దేశం ఎక్కువగా నష్టపోయిందని.. పార్లమెంట్‌లొ మోడీ స్పీచ్ అధ్వాన్నంగా వుందని కేసీఆర్ చురకలంటించారు. అదానీ గురించి ప్రధాని ఏం మాట్లాడలేదన్నారు. అదానీ రూపంలో దేశానికి ఉపద్రవం వచ్చిందని.. ఇంత గొడవ జరుగుతున్నా అదానీ గురించి ప్రధాని మాట్లాడలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ ఆస్తి కరిగిపోయిందని.. ఆయన సంస్థలు ఉంటాయో, పోతాయోనని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చాడని.. అదృష్టం బాగుండి మన దగ్గర అదానీ కంపెనీ రాలేదన్నారు. 

ALso REad : గెంటేసినవాళ్లు పిలిస్తే మళ్లీ పోతానా.. నాపై దాడిని మరిచిపోను : కేసీఆర్‌కు ఈటల రాజేందర్ కౌంటర్

అదానీ గురించి మోడీ సమాధానం చెప్పకుండా జబ్బ కొట్టుకున్నారని.. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయం ఏంటని ఆయన ప్రశ్నించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే.. నువ్వెన్ని అంటూ మోడీ, రాహుల్ గొడవపడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశం పరిస్ధితి క్రిటికల్‌గా వుంటే మోడీ మాట్లాడరని.. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం వుండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువని సీఎం తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అన్నారు. మనదేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని.. మొత్తం 192 దేశాల్లో మనదేశం ర్యాంక్ 139 అని కేసీఆర్ తెలిపారు. మోడీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగా ఇవ్వాలని సీఎం చురకలంటించారు. భారతదేశ విషయాలు హిండెన్ బర్గ్ బయటపెట్టిందని.. ఇంత జరుగుతున్నా అదానీపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడని ఆయన దుయ్యబట్టారు. దీనిపై పార్లమెంట్‌లో బీఆర్ఎస్,కాంగ్రెస్ కొట్లాడాయని కేసీఆర్ గుర్తుచేశారు.