Asianet News TeluguAsianet News Telugu

గెంటేసినవాళ్లు పిలిస్తే మళ్లీ పోతానా.. నాపై దాడిని మరిచిపోను : కేసీఆర్‌కు ఈటల రాజేందర్ కౌంటర్

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సెటర్లు వేశారు. దీనికి ఈటల తనదైన శైలిలో స్పందించారు. గెంటేసినవాళ్లు పిలిచినా పోనని.. తన మీద చేసిన దాడిని మరిచిపోనని ఆయన వెల్లడించారు. 

bjp mla etela rajender counter to telangana cm kcr over his comments in assembly
Author
First Published Feb 12, 2023, 6:17 PM IST | Last Updated Feb 12, 2023, 6:17 PM IST

తెలంగాణ అసెంబ్లీ చివరి రోజున సీఎం కేసీఆర్ పదే పదే తన పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల చరిత్ర తెలిసినవాళ్లు.. తన గురించి తక్కువ ఆలోచన చేయలేరని స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని ఈటల రాజేందర్ అన్నారు. తాను అడిగినవాటికి సమాధానంన చెప్పినంత మాత్రాన తాను పొంగిపోనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో వున్నప్పుడు సైనికుడిగా పనిచేశానని, బీజేపీలో కూడా అలాగే పనిచేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. తాను పార్టీ మారలేదని, వాళ్లే తనను గెంటేశారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

గెంటేసినవాళ్లు పిలిచినా పోనని ఆయన కుండబద్ధలు కొట్టారు. సభలో తన సొంత అజెండా వుండదని.. సభలో తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తానని రాజేందర్ తెలిపారు. మెస్‌ఛార్జీలపై మీటింగ్‌కు పిలిస్తే వెళ్తానని ఈటల పేర్కొన్నారు. తాను బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడినని వెల్లడించారు. తాను అడిగినవాటికి సమాధానం చెప్పినంత మాత్రాన తాను పొంగిపోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ రోజు సీఎం కేసీఆర్ తన పేరు ప్రస్తావించారని పొంగిపోనని.. తన మీద చేసిన దాడిని మరిచిపోనని ఆయన వెల్లడించారు. 

ALso REad: ఇటు నుంచి అటు మారితే.. అన్ని మర్చిపోతారా : ఈటల టార్గెట్‌గా అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలు

కేవలం ఏడు రోజులు మాత్రమే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగడం పట్ల  ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయం సభ జరగలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ విషయంగా తాను లేవనెత్తానని ఈటల తెలిపారు.మహిళా సంఘాలకు గత నాలుగున్నర సంవత్సరాలుగా , వడ్డీలేని రుణాలు రావడం లేదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో రావడం లేదని ఈటల దుయ్యబట్టారు. గెస్ట్ లెక్చరర్లు, విద్యా వాలంటీర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు అందక స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం వుండాలని.. కానీ కేవలం 105 మంది సభ్యుల బలం వుందనే మదంతో ప్రతిపక్షాల గొంతునొక్కేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఈటల ఆరోపించారు. ఫోటోగ్రాఫ్‌లు తెచ్చి తమను అవమానపరిచారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్పించి.. తాము అడిగే వాటికి సమాధానం మాత్రం చెప్పలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన లెక్కలు ప్రజలు నమ్మరని.. రైతుల రుణమాఫి జరగలేదని, మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదని, ఫించన్లు కూడా ఒకనెల ఇవ్వలేదని రాజేందర్ అన్నారు.

Also REad: కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా : బండి సంజయ్ , రేవంత్ రెడ్డిలకు కేసీఆర్ వార్నింగ్

పోలీసులకు సైతం అలవెన్సులు రావడం లేదని.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రధాని మోడీపై నెపం నెడుతున్నారని ఈటల ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజల చేత మోడీ ప్రేమించబడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఆయనే ప్రధాని అవుతారని ఈటల జోస్యం చెప్పారు. ఆర్ధిక మాంద్యంతో ప్రపంచం వణికిపోతుంటే.. భారతదేశం మాత్రం ఎక్కడా తొణకుండా నిలబడిందంటే మోడీ ఘనతేనని ఆయన ప్రశంసించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios