కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అమలు కాలేదని కేసీఆర్ గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో షాపుల్లో మద్యం దొరకలేదు కానీ బజారుల్లో ఏరులై పారిందని.. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో గుడుంబా బట్టీలు ఉండేవని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రజలు మద్యం వైపుకు వెళ్లకూడదనే లిక్కర్ రేట్లు పెంచామని, అవసరమైతే మరింతగా పెంచుతామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన పన్నుల వాటాల్లో తెలంగాణకు కోత పెట్టారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు.

Also Read:కేంద్రంపై తెలంగాణ ఆధారపడలేదు.. మన భిక్షపైనే కేంద్రం ఆధారపడింది: అసెంబ్లీలో కేసీఆర్

15వ ఆర్ధిక సంఘం తెలంగాణకు రూ.723 కోట్లు స్పెషల్ గ్రాంట్ల కింద ఇవ్వాలని సిఫారసు చేస్తే కేంద్రం పక్కన పెట్టిందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడితే అప్పులని విమర్శించేవారని ఆ పార్టీలు ఇప్పుడే ఏమయ్యాయో అందరికీ తెలుసునని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశం అమెరికాయేనని.. అదే సమయంలో హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు పడినా నిలదొక్కుకున్న జపాన్ రుణాలు తీసుకుని అద్భుతమైన ప్రగతి సాధించిందని కేసీఆర్ గుర్తుచేశారు.

అప్పులు తెచ్చుకున్నంత మాత్రాన అమెరికా, జపాన్‌లు తెలివి తక్కువ దేశాలా.. తెచ్చిన అప్పులు ఏం చేశామన్నదే ఇక్కడ పాయింట్ అని సీఎం అన్నారు. లక్ష కోట్ల రూపాయలను కేవలం ఇరిగేషన్ మీద పెట్టామని, రెండేళ్లలోనే ఆ అప్పు తీరిపోతుందని కేసీఆర్ తేల్చి చెప్పారు.

23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌‌లో లక్షా 35 వేల కోట్లని, అదే పది జిల్లాల తెలంగాణకు ఖర్చు చేశామన్నారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరగడం అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇది జరిగేదేనని కేసీఆర్ వెల్లడించారు.

70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్, టీడీపీలు ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాయో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే లక్ష కుటుంబాలు వస్తాయని ఉద్యమం సమయంలో చెప్పానని... అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువే ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ కింద ఖర్చు చేసిన వ్యయం, ఇతర వివరాలను పెన్ డ్రైవ్‌లో పెట్టి శాసనసభకు సమర్పించిన ఏకైక ప్రభుత్వం తమదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. గిరిజనుల పోడు భూముల వ్యవహారంపై పరిష్కారం దిశగా తాము ప్రణాళికలు రూపొందిస్తున్నామని... తనతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Also Read:దేశ ద్రోహులమౌతామా ?.. సీఏఏ పై అసెంబ్లీలో కేసీఆర్

3,100కు పైచీలుకు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమ ప్రభుత్వానిదేనని సీఎం గుర్తుచేశారు. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ కావాలంటే రెండు కోట్లు కట్టాలని చెప్పేవారని కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రుసుములు పెంచలేదని, కానీ ఈసారి బడ్జెట్‌లో లక్ష్యాలు దృష్ట్యా కొంత ఛార్జీలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు గాను రూ. 1000 కోట్లు ఆర్ధిక సాయం ప్రకటించడంతో పాటు ఛార్జీలు పెంచామని కేసీఆర్ గుర్తుచేశారు.