తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నెల 16 నుంచి పాదయాత్ర చేయనున్నారు. రాష్ట్ర మంతా ఆయన హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే తెలిపారు.  

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టిన అధిష్టానం నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. దీనిలో భాగంగా కీలక నేతలతో పాదయాత్రలు చేయిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర మొదలుపెట్టారు. దీనికి సమాంతరంగా మరో నేత మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా యాత్రకు దిగనున్నారు. ఈ నెల 16 నుంచి భట్టి పాదయాత్ర చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే భట్టి పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ప్రకటిస్తామని థాక్రే తెలిపారు. 

అంతకుముందు గాంధీ భవన్‌లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్షా సమావేశం సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ఆ పార్టీ నేతలు బడాయిలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తాము కట్టిన కంపెనీల నుంచే విద్యుత్ ఇస్తున్నారని భట్టి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మరాయని సీఎల్పీ నేత విమర్శించారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని .. బీఆర్ఎస్ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు. 

Also Read: ఎవరు పాదయాత్ర చేసినా కాంగ్రెస్ కోసమే, అన్నీ జోడో యాత్రలే : తేల్చేసిన మహేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక భద్రాద్రి, యాదాద్రి రెండు విద్యుత్ ప్లాంట్లను మాత్రమే చేపట్టిందని భట్టి అన్నారు. అందులో యాదాద్రి ఇంకా ప్రొడక్షన్‌ ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు నీళ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ మాత్రమేనని .. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణం జరిగిందని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్‌లో భూముల రెట్లు పెరిగాయని విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ చుక్కనీరు పారలేదని అన్నారు. 

కాగా.. రేవంత్ రెడ్డికి పోటీగా మహేశ్వర్ రెడ్డి సైతం పాదయాత్రకు దిగడంతో పంచాయతీ మొదలైంది. ఈ సందర్భంగా సీనియర్ నేతలు రేవంత్ పాదయాత్రకు డుమ్మా కొట్టి.. మహేశ్వర్ రెడ్డికి మద్ధతు పలికారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు మహేశ్వర్ రెడ్డి యాత్రకు హాజరయ్యారు. అటు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే మాత్రం రేవంత్ పాదయాత్రకు హాజరవ్వడం కలకలం రేగింది. మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం ఆమోదం వుందని సీనియర్లు అంటున్నారు. 

ALso REad: టీ.కాంగ్రెస్‌లో పాదయాత్రల పంచాయతీ : రేవంత్ యాత్రకు సీనియర్లు డుమ్మా.. మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్, భట్టి మద్ధతు

ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి స్పందించారు. తమ మధ్య గ్రూపులు లేవని.. పార్టీలో ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకే నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబమని.. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్ రెడ్డి తేల్చేశారు. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్, నేతలు వున్నారని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.