తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దున్నపోతు ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి గొర్రెలను ఉపయోగించి సెటైర్లు వేశారు జితేందర్ రెడ్డి.
ఇటీవల ఓ దున్నపోతు వీడియో పెట్టి తెలంగాణ బీజేపీలో కలకలానికి కారణమైన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి .. తాజాగా మరోసారి అదే తరహాలో ట్వీట్ చేశారు. ప్రధాని అభ్యర్ధి కోసం ప్రతిపక్షాలు పోటీపడుతున్న తీరు ఇలా వుందంటూ ఆయన సెటైర్లు వేశారు. సదరు వీడియోలో ‘‘ఒక స్టూల్‌పై నిలబడేందుకు గొర్రెలు ఒకదానికొకటి పోటీపడుతూ వుంటాయి’’ దీనిని ఉదహరిస్తూ.. ప్రస్తుతం మనదేశంలో ప్రధాని పదవి కోసం ఈ గొర్రెల మంద మాదిరిగానే ప్రతిపక్షనేతలు పోటీపడుతున్నారని జితేందర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాగా.. గత నెల 29న జితేందర్ రెడ్డి చేసిన సెటైరికల్ ట్వీట్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ స్థాయిలో కలకలం రేపింది. ఆ ట్వీట్‌లో జంతువును వెనకాల నుంచి కాలుతో తన్నుతూ ట్రాలీ ఎక్కిస్తున్న వీడియోను షేర్ చేసిన జితేందర్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో బీఎల్ సంతోష్, బీజేపీ పార్టీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తెలంగాణ బీజేపీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు. అయితే కొద్దిసేపటికే జితేందర్ రెడ్డి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
ALso Read: టీ బీజేపీలో జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ వీడియో పోస్టు.. కాసేపటికే..
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర నాయకత్వ పనితీరుపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. దీంతో బీజేపీ అధిష్టానం నష్ణనివారణ చర్యలకు దిగింది. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జితేందర్ రెడ్డి.. ఈ విధమైన ట్వీట్ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
