తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దైంది.

తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దైంది. సునీల్ బన్సల్‌ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారని.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్షించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిందేకు ఆయన ప్రయత్నిస్తారనే ప్రచారం సాగింది. బీజేపీ వర్గాలు కూడా ఈరోజు ఉదయం వరకు సునీల్ బన్సల్ హైదరాబాద్ పర్యటన ఉంటుందనే చెప్పుకొచ్చాయి. అయితే ఆకస్మాత్తుగా సునీల్ బన్సల్ హైదరాబాద్ పర్యటన రద్దైనట్టుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. 

ఈ పరిణామాలతో తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ అటు పార్టీ కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీలో నేతలు ఒక్కొక్కరిగా అసంతృప్త గళాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలుత ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించిన బీజేపీ అధిష్టానంతో వారితో చర్చించింది. ఆ తర్వాత రాష్ట్రానికి చేరుకున్న ఈటల రాజేందర్‌ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ రాష్ట్రంలో పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగుతుంది.

మరోవైపు జితేందర్ రెడ్డి ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారమే రేపింది. ఈ క్రమంలోనే సోమవారం జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఈటల రాజేందర్ ఆయనతో చర్చలు జరిపారు. ఇదిలా ఉండగానే.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మరో బాంబు పేల్చారు. కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రఘునందన్ రావు మీడియా చిట్‌చాట్‌‌లో.. సొంత పార్టీ నాయకులపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత కాసేపటికే తాను అలాంటి మాటలు అనలేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి కవరింగ్ ఇచ్చుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మరోవైపు రఘునందన్ ‌రావు చేసిన కామెంట్స్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు.. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. 

ఈ పరిణామాల కొనసాగుతుండగానే.. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించనున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని కూడా అంటున్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించనున్నారని.. ఈ మేరకు ఈరోజు గానీ, రేపు గానీ అధికార ప్రకటన వస్తుందని బీజేపీ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ బన్సల్ ఢిల్లీలోనే ఉండిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్, రఘునందన్ రావు‌లతో పాటు మరికొందరు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.