తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇంచార్జీగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను కో ఇంచార్జీగా సునీల్ బన్సల్‌ను జేపీ నడ్డా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సంస్థాగత మార్పులను వేగంగా చేపడుతున్నది. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జీలను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ జవడేకర్‌ను నియమించింది. కో ఇంచార్జీగా సునీల్ బన్సల్‌ను నియమిస్తూ ప్రకటన వెలువరించింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నిర్ణయాలను తీసుకోగా.. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ ప్రకటనలు చేశారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా సునీల్ బన్సల్ గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన బీజేపీ ఎన్నికల కో ఇంచార్జీగా నియామకం అయ్యారు. ఇటీవల బీజేపీ ప్రారంభించిన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రకాశ్ జవడేకర్ తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. 

Also Read: చంద్రబాబు నాయుడుపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన నిజాయితిని శంకించాల్సిందే?

ఈ ప్రకటన వెలువడానికి రెండు రోజుల ముందే తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. అదే విధంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అంతకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడి గా నియమించిన సంగతి తెలిసిందే.

తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జీలను బీజేపీ నియమించింది. ఛత్తీస్‌గడ్ ఎన్నికల ఇంచార్జీగా ఓపీ మాథుర్, కో ఇంచార్జీగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయాను, రాజస్తాన్ ఎన్నికల ఇంచార్జీగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇంచార్జీగా నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇంచార్జీగా భూపేంద్ర యాదవ్, సహాయ ఇంచార్జీగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌లను బీజేపీ నియమించింది.

త్వరలోనే తెలంగాణ సహా రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.