చంద్రబాబు నాయుడుపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన నిజాయితిని శంకించాల్సిందే?
చంద్రబాబు నాయుడుపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి టీడీపీ వెళ్లుతుందనే వార్తలపై స్పందిస్తూ.. ఏపీని అభివృద్ధి చేయడానికి కేంద్రంలోని బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను చెప్పాలని చంద్రబాబు నాయుడును ఆయన నిలదీశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి భాగస్వాములతో నిర్వహించబోయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం వచ్చిందని, దానికి టీడీపీ హాజరు కావాలనే నిర్ణయాలు తీసుకున్నారని వచ్చిన వార్తలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ నిర్వహించబోయే సమావేశానికి ఎన్డీఏ పార్ట్‌నర్‌లు హాజరవుతాయని, ఈ భేటీకి టీడీపీకి కూడా ఆహ్వానం అందినట్టు వార్తలు వచ్చాయి. ఒక వేళ ఆహ్వానం అందినా దానిపై టీడీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నది స్పష్టంగా తెలియరాలేదు. ఎన్డీఏ భేటీకి ఆహ్వానం అందిందని, ఆ భేటీకి హాజరు కావాలనే టీడీపీ నిర్ణయించుకున్నట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ భేటీకి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్టూ వార్తలు వచ్చాయి.
టీడీపీ ఎన్డీఏ కూటమికి వెళ్లుతారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు అనేక అంశాలపై, సమస్యలపై కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబు అసలు రూపం ఇదా? అంటూ అడిగారు. కేంద్రానికి వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన టీడీపీ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నదా? అని ప్రశ్నించారు. అలాగైతే.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తామనే చంద్రబాబు నాయుడు నిజాయితీని శంకించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.
అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిందో చంద్రబాబు నాయుడు వెల్లడించాలని నిలదీశారు.
పట్నాలో విపక్షాల సమావేశానికి ఇటు జగన్‌కు అటు చంద్రబాబు నాయుడుకూ ఆహ్వానాలు అందకపోవడం గమనార్హం.