టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం టైం పాస్ చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్స్ లేవన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిరుద్యోగ మార్చి జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ.. మీ తప్పు లేకుంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ 30 లక్షల మంది యువత కోసం కొట్లాడుతోందని సంజయ్ తెలిపారు. కేసీఆర్ కుటుంబానికో న్యాయం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకో న్యాయమా అని ప్రశ్నించారు. విద్యార్ధులు చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడలేదని.. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని సంజయ్ దుయ్యబట్టారు.
ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం టైం పాస్ చేస్తోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో తప్పులు జరగట్లేదని ఆయన తెలిపారు. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నష్టపోయిన యువతకు రూ.లక్ష నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన కోరారు. నిరుద్యోగ మార్చ్‌కు ఎవరు రారన్నారని.. బీఆర్ఎస్ నేతలు కంటి వెలుగు ఆపరేషన్ చేసుకోవాలని బండి సంజయ్ చురకలంటించారు.
Also Read: అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం లేదు.. చాలా బాధపడ్డాను: గవర్నర్ తమిళిసై
ఈ నిరుద్యోగ మార్చ్ ఆగదని.. ఈ నెల 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. భాగ్యనగర్ గడ్డపై నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నారా అని ఆయన ప్రశ్నించారు.
