భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించింది. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ హాజరుకాలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసైకు ప్రభుత్వం ఆహ్వానం పంపిందా? లేదా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానంపై తాజాగా గవర్నర్ తమిళిసై స్పందించారు.
ఈరోజు ఓ కార్యక్రమానికి హాజరైన తమిళిసై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఆహ్వానం రాలేదని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం వచ్చి ఉంటే తప్పకుండా వెళ్లేదానినని తెలిపారు. అంబేడ్కర్ దేశాభివృద్ది, మహిళ సాధికారికత గురించి కృషి చేశారని అన్నారు. ఎక్కువగా మహిళల హక్కుల గురించి మాట్లాడరని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు మహిళా గవర్నర్‌కు ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. అయితే తాను కూడా చాలా బాధపడ్డానని చెప్పారు. అయితే తాను రాజ్‌భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించానని గవర్నర్ తమిళిసై తెలియజేశారు.
ఇక, తెలంగాణలో గత కొంతకాలంగా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్‌గా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు.
