బీఆర్ఎస్, వైసీపీల బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వైసీపీ, బీఆర్ఎస్‌లు ఒకే నాణేనికి వున్న బొమ్మాబొరుసు లాంటివని ఆయన ఆరోపించారు. ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం విశాఖపట్నానికి స్టీల్ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తలదూర్చడం ఏపీలోని అధికార వైసీపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ కొద్దినెలలుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళణ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్రంపై పోరాడాల్సిందిగా ఇక్కడి వైసీపీ, టీడీపీ, జనసేన , కమ్యూనిస్టు పార్టీలను కూడా పలమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ పార్టీల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్లాంట్ ఉద్యోగులు బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్‌ను కలిశారు. వారి న్యాయమైన డిమాండ్‌కు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ వ్యవహారం ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.
ALso Read: కేసీఆర్ ఫ్యామిలీని టెర్రరిస్టులతో పోలుస్తూ .. మంత్రి అప్పలరాజు మాటలు మిస్‌ఫైర్, క్లాస్ పీకిన జగన్
తాజాగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటన మరోసారి రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను వేడెక్కించింది. ఇది తమ ఘనతేనంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి వైసీపీ నేతలు, మంత్రులు కౌంటరిస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనే డబ్బుంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడంతో పాటు నిజాం షుగర్స్ తెరవొచ్చు కదా అని డిమాండ్ చేశారు. వైసీపీ, బీఆర్ఎస్‌లు ఒకే నాణేనికి వున్న బొమ్మాబొరుసు లాంటివని సంజయ్ విమర్శించారు. ఈ రెండు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రగిలిస్తున్నాయని.. ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
