తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై బీఆర్ఎస్ నేతలు, మంత్రులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం అప్పలరాజుపై సీరియస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం విశాఖపట్నానికి స్టీల్ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తలదూర్చడం ఏపీలోని అధికార వైసీపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ కొద్దినెలలుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళణ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్రంపై పోరాడాల్సిందిగా ఇక్కడి వైసీపీ, టీడీపీ, జనసేన , కమ్యూనిస్టు పార్టీలను కూడా పలమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ పార్టీల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్లాంట్ ఉద్యోగులు బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్‌ను కలిశారు. వారి న్యాయమైన డిమాండ్‌కు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ వ్యవహారం ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.
సరిగ్గా ఇదే సమయంలో ఏపీలోని పాలన, రోడ్లపై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారు వారి ఓటు హక్కును, ఆధార్ కార్డును ఇక్కడికి మార్పించుకోవాలన్నారు. అంతేకాకుండా ఏపీ, తెలంగాణల మధ్య భూమికి , ఆకాశానికి వున్నంత తేడా వుందన్నారు. ‘‘ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసు’’ అని కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీలోని వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావులు స్పందించి కౌంటరిచ్చారు. అయితే మరో మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఏకంగా సీఎం కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారు.
ALso REad: కల్లు తాగిన కోతి లాగా హరీష్ రావు కి ఒళ్ళు కొవ్వెక్కింది : ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు
హరీశ్‌ను ఉద్దేశిస్తూ కల్వకుంట్ల కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీ జాగీరా.. నువ్వు (హరీశ్ రావు), మీ మామ (కేసీఆర్), మీ మామ కొడుకు (కేటీఆర్), మీ మామ కూతురు (కవిత) మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులని అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన మాటలు ఆపి.. మీ సంగతి మీరు చూసుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రవాళ్లు తెలంగాణకు రావడం ఆపేస్తే.. అక్కడ అడుక్కుతినడం తప్ప ఏం వుండదని అప్పలరాజు వ్యాఖ్యానించారు. వీళ్లు బుర్ర తక్కువ తెలంగాణ వాళ్లు అంటూ అని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అప్పలరాజుపై భగ్గుమన్నారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అప్పలరాజుపై సీరియస్ అయ్యారు. మంత్రిగా బాధ్యత గల పదవిలో వుండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని సీఎం హెచ్చరించారు. అటు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం అప్పలరాజును సున్నితంగా మందలించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బొత్స తెలిపారు. అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదని.. ఆయన అలా మాట్లాడి వుంటారని తాను అనుకోవడం లేదని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఒకవేళ అలాంటి మాటలు అటే మాత్రం తాను వాటిని ఖండిస్తున్నట్లు బొత్స చెప్పారు. బాధ్యత గల వ్యక్తులు నోటికొచ్చినట్లు మాట్లాడకూడదని.. అలా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామన్నారు.
