టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రేపు బండి సంజయ్ దీక్ష, కేసీఆర్‌కు పెట్టిన డిమాండ్లివే..?
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంజయ్ దీక్ష నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని .. నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇప్పించాలనే డిమాండ్లతో బండి సంజయ్ నిరసన దీక్ష నిర్వహించనున్నారు.
మరోవైపు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇందులో రాజకీయ కోణాలు వున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని ఫోటోలు విడుదల చేశారు మంత్రి కేటీఆర్. స్కాం వెనుక వున్న సూత్రధారులను కనిపెట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కేటీఆర్ డీజీపీని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ కుట్ర చేసినట్లుగా అనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమాయకుల జీవితాలను నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు.
Also REad: ఒకటి కాదు .. మొత్తం ఐదు పేపర్లు దొంగతనం, బేరాల పని రేణుకకి : వెలుగులోకి ప్రవీణ్ బాగోతాలు
ఇకపోతే.. పేపర్ లీక్ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రతీది రాజకీయం చేయడం అలవాటైపోయిందని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌నూ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా రాజకీయం చేసి తమ అసమర్థ పాలన, అవినీతి పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఇది సరికాదని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని రాజకీయం చేసి పక్క పార్టీపై నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని రాజేందర్ హితవు పలికారు. ఈ లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయించి కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని ఈటల అన్నారు.
సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి దోషులు తప్పించుకోకుండా చూడాలని, దోషులకు కఠిన శిక్ష పడేలా చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు. కానీ, కేసీఆర్ పాలన.. మ్యాక్సిమమ్ పాలిటిక్స్, మినిమమ్ రూలింగ్ అన్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. చేసిన కొన్నింటిలో అక్రమాలు చేసి యువత భవితను కేసీఆర్ సర్కారు అంధకారంలో ముంచుతున్నదని ఈటల విమర్శలు చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ కేవలం నోటిఫికేషన్‌లతోనే సరిపెడుతున్నాడని ఆరోపించారు. పేపర్ లీక్ అవ్వగానే సింపుల్‌గా పరీక్ష రద్దు చేస్తామని ప్రకటిస్తున్నారని, కానీ, ఈ నిర్ణయం వెనుక ఎంతమంది అభ్యర్థుల ఆర్తనాధాలు ఉన్నాయో కేసీఆర్ అర్థం చేసుకోగలడా? అని ఈటల మండిపడ్డారు.