ఒకటి కాదు .. మొత్తం ఐదు పేపర్లు దొంగతనం, బేరాల పని రేణుకకి : వెలుగులోకి ప్రవీణ్ బాగోతాలు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతను ఈ నెల 5న జరిగిన పరీక్షతో పాటు మరో 4 పేపర్లను కొట్టేసినట్లు పోలీసులు తేల్చారు. అభ్యర్ధులను వెతికి బేరమాడి పెట్టాలని రేణుకకు చెప్పాడు ప్రవీణ్.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లుగా పోలీసులు తేల్చారు. టీఎస్‌పీఎస్సీ అధికారులతో సిట్ చీఫ్ భేటీ అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. లక్ష్మీ నుంచి ప్రవీణ్ పాస్‌వర్డ్ చోరీ చేయడంపై సిట్ చీఫ్ వివరాలు సేకరిస్తున్నారు. ప్రవీణ్‌కు లబ్ధి చేకూర్చేందుకు గాను కంప్యూటర్ LANలో మార్పులు చేశాడు రాజశేఖర్. రాజశేఖర్ సాయంతో పేపర్లు కొట్టేశాడు ప్రవీణ్.
అనంతరం తన దగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో పేపర్లు సేవ్ చేసుకున్నాడు ప్రవీణ్ కుమార్. 5న జరిగిన పరీక్షతో పాటు , మరో 4 పేపర్లు కొట్టేశాడు ప్రవీణ్. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ , గ్రౌండ్ వాటర్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల పేపర్లను తన దగ్గర పెట్టుకున్నాడు ప్రవీణ్. సమయం చూసి పేపర్లను విక్రయించేందుకు ప్రవీణ్ ప్లాన్ చేశాడు. భవిష్యత్తులో జరిగే పరీక్షా పత్రాలు ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అభ్యర్ధులను వెతికి బేరమాడి పెట్టాలని రేణుకకు చెప్పాడు ప్రవీణ్.
ALso REad:పేపర్ లీకేజ్ బీజేపీ కుట్రే, నిందితుడు రాజశేఖర్ ఆ పార్టీ కార్యకర్తే.. ఫోటోలు విడుదల చేసిన కేటీఆర్
మరోవైపు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇందులో రాజకీయ కోణాలు వున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని ఫోటోలు విడుదల చేశారు మంత్రి కేటీఆర్. స్కాం వెనుక వున్న సూత్రధారులను కనిపెట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కేటీఆర్ డీజీపీని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ కుట్ర చేసినట్లుగా అనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమాయకుల జీవితాలను నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఇకపోతే.. పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. ఇంజనీరింగ్ విభాగాల్లోని 837 పోస్టులకు ఈ పరీక్షను నిర్వహించారు. మార్చి 5న దాదాపు 55 వేల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు.