తనకు మంచి నడవడికతో పాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు ప్రేమిస్తున్నానని మోసం చేయగా.. దాని నుంచి కోలుకుని చదువుకుంటుండగా మరో యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడటంతో ఓ యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా డిండి మండలానికి చెందిన బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరింది.

అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానన్నాడు.. మూడు సంవత్సరాలు వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే కొన్నాళ్లకి మొహం చాటేశాడు. తనకు జరిగిన మోసం నుంచి కోలుకుని గతేడాది పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధిని హైదరాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మరో యువకుడు ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడ్డాడు..

ఒక రోజు ‘నువ్వు మరో వ్యక్తితో సంబంధం కొనసాగించడం భరించలేక ఆత్మహత్య చేసుకుంటునంటూ’ ఫోన్‌కు మెసేజ్‌లు పంపించాడు.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 5న హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ బిడ్డ బలవన్మరణానికి కారణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు.. సెల్‌ఫోన్‌లో ఉపాధ్యాయుడితో మాట్లాడిన మాటలు, ఫోటోలు చూసి.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. దీంతో అతను రూ.6.50 లక్షలు మృతురాలి కుటుంబానికి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు..