దిశా హత్యాచారం ఆతరువాత ఆ నిందితుల ఎన్కౌంటర్ ఇవన్నీ వెరసి తెలంగాణలో రాజకీయం ఒకింత వెనుక సీట్లోకి వెళ్ళింది. దానికి తోడుగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, మద్దతుగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణం, ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం కూడా తోడవడంతో తెలంగాణ రాజకీయాలు అంత ప్రాముఖ్యాన్ని సంతరించుకోలేదు.  

ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల నగారా మోగడంతో మరోమారు రాజకీయవాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయమై సమాలోచనలు జరుపుతున్నారు. 

తెలంగాణ గవర్నర్ గా యాక్టీవ్ పొలిటీషియన్ తమిళిసై సౌందర రాజన్ వచ్చినప్పటి నుంచి కూడా కెసిఆర్ కు పక్కలో బల్లెంలా ఆమె తయారవుతారనే వాదనలు బయల్దేరాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ నేతలు వెళ్లి ఆమెను కలవడం ఇలా కొన్ని పరిణామాలు జరిగినా ఆమె పాత్ర మాత్రం అంత ప్రాముఖ్యాన్ని, వివాదాన్ని సంతరించుకోలేదు. 

Also read; అచ్చం కుముద్ బెన్ జోషీ లాగే తమిళిసై: కేసీఆర్ పక్కలో బల్లెం?

తాజాగా కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ గా తొలగించాలని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏకంగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసారు. ఇలా ఒక ఆక్టివ్ పొలిటీషియన్ ఎంతలా ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించొచ్చో మనం చూసాం. 

ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై గారు తెలంగాణాలో నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మీద సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ బృందం ఇచ్చిన విజ్ఞప్తిని సీబీఐకి కాకుండా ఏసీబీకి చేరవేసారట. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలను తెలియజేశారు. 

సీబీఐకి పంపించామని కాంగ్రెస్ కోరినా.... తన పరిమితులకు లోబడి మాత్రమే తాను పనిచేశానని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం విషయంలో చాలా అవకతవకలు జరిగాయని అందరూ అంటున్న నేపథ్యంలో ఆమె రోడ్డు మార్గం గుండా కాల్;ఈశ్వరన్ చేరుకొని అక్కడ ఆ బృహత్తర ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ఆ ప్రాజెక్టును చూసి ఆమె అప్పుడు చాల సంతోషం వ్యక్తం చేసింది. 

కిరణ్ బేడీ ఉదంతం తరువాత గవర్నర్ తమిళిసై చాలా హుందాగా వ్యవహరించారని చెప్పక తప్పదు. ఆమె కాళేశ్వరాన్ని తెలంగాణ భావితరాలకు వరంగా పేర్కొనడం... ప్రభుత్వాన్ని తన విధి నిర్వర్తించుకోవడానికి వీలు కల్పించడం నిజంగా హర్షణీయం పరిణామం. 

అంతే కాకుండా ఆమె ఇలా ప్రతిపక్షాలను ఎంకరేజ్ చేయను అనే ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు... తాను మరొక పవర్ సెంటర్ కాదల్చుకోలేదు అనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. 

గవర్నర్ వైఖరి ఇలా ఉండడం కేంద్రం ఝార్ఖండ్ ఎన్నికల ఫలితం తరువాత వెనకడుగు వేయడమా లేక ఎప్పటికైనా తెరాస తోని అవసరం వస్తుందనే మిత్రులను దగ్గరతీసే ప్లాన్ లో భాగమా అనేది ఇప్పటికైతే చెప్పలేము. 

Also read: ఒకదానిపై మరొకటి: కేసీఆర్ పై తమిళిసై మరో అస్త్రం

రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటములు చెందుతున్నవేళ కేంద్రం పాత మిత్రులను అలానే ఉంచుకుందామని భావిస్తూ ఉండొచ్చు. కాకపోతే కెసిఆర్ మాత్రం బీజేపీతో అమీతుమీకి సిద్ధపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు ఎప్పుడు తీసుకుంటాయో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.