తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అనుకున్నట్టుగానే కెసిఆర్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వచ్చిన నెల రోజులకే అధికార తెరాస ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. మొన్న ప్రజా దర్బారు నిర్వహిస్తానని ప్రకటించిన తమిళిసై నిన్న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలోని ఆర్టీసీ సమ్మెపై నివేదిక ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

బీజేపీ ఒక యాక్టీవ్ పొలిటీషియన్ ని గవర్నర్ గా పెట్టడం ద్వారా ఇక్కడి కెసిఆర్ ప్రభుత్వానికి చిక్కులు సృష్టించనుందని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఇప్పటికే అటువంటి ఒక సంఘటనను మనం పుదుచ్చేరి విషయంలో చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న కిరణ్ బేడీని గవర్నర్ గా నియమించింది మోడీ సర్కార్. ఆమె అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. స్వయంగా పాలనాపరమైన అంశాలలో ఇన్వాల్వ్ అవుతూ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. 

మన రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో కుముద్ బెన్ జోషి ప్రత్యక్ష రాజకీయాల్లో  క్రియాశీలకంగా ఉన్నప్పుడే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పట్లో ఆమె గణతంత్ర దినోత్సవం నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ చేసిన ప్రసంగం ఒక సంచలనం సృష్టించింది. గవర్నర్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆమె మొత్తం రాష్ట్రమంతా కలియతిరుగుతూ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీని బలపరిచారని టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శించారు. 

RTC Strike: రంగంలోకి దిగిన గవర్నర్ తమిళిసై, కేసీఆర్‌కు చిక్కులు

ఇందాక కొద్దిసేపటి కింద ఆర్టీసీ సమ్మె అంశమై రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కి ఫోన్ చేసారు గవర్నర్ తమిళిసై. చేసేదేమిలేక రవాణా శాఖా కార్యదర్శి సునీల్ శర్మను మంత్రి గవర్నర్ వద్దకు పంపించాడు. పూర్తి నివేదికతో గవర్నర్ ను కలిసేందుకు సునీల్ శర్మ రాజ్ భవన్ కు చేరుకున్నారు. త్వరలో రాజ్ భవన్ కు మంత్రి అజయ్ ని కూడా గవర్నర్ పిలిపించి మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. 

గత పర్యాయం తెరాస, బీజేపీల మధ్య కొంత అప్రకటిత స్నేహం ఉందన్నమాట వాస్తవం. కానీ పార్లమెంటరీ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే గెల్చిన బీజేపీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 4సీట్లు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. అవికూడా తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టులైన ఉత్తర తెలంగాణాలో గెలవడం, స్వయానా కెసిఆర్ కూతురు ఓడిపోవడం ఇత్యాది అన్ని కారణాల వల్ల బీజేపీ ఇక్కడ నేరుగా తెరాస ను ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. 

అందులో భాగంగానే, అమిత్ షా ఇక్కడికి తరచూ వచ్చి వెళుతూ ఉండడం, ప్రతి నెలా ఎవరో ఒక జాతీయ నాయకుడో, కేంద్ర మంత్రో పర్యటిస్తుండడం మనం చూస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టడం వారి ఆలోచనను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది.   

గవర్నర్ గా తమిళిసాయి: ఎన్టీఆర్, కుముద్ బెన్ జోషీ ఎపిసోడ్ రిపీట్?

దక్షణ భారత దేశంలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే పాగా వేయడం వారి ముందున్న లక్ష్యంగా ఆ పార్టీ నాయకులే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు. తెలంగాణను మరో కర్ణాటక చేస్తాం అనే మాట ఎన్నోసార్లు బీజేపీ అగ్రనాయకులు నోట మనం వింటూనే ఉన్నాం. 

ఈ నేపథ్యంలో ఇలా ఆక్టివ్ పొలిటీషియన్ గవర్నర్ గా ఉండడం కెసిఆర్ ప్రస్తుత చిక్కులను మరింత ఎక్కువ చేసేవిగా ఉన్నాయి. హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గట్టిపోటీ ఇవ్వాలని బీజేపీ భావించినా అగ్రనాయకత్వం అంతా హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో స్టార్ క్యాంపెయినరులెవ్వరూ హుజూర్ నగర్ కు రాలేదు. వారికి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె అంది వచ్చిన అవకాశం. 

ఇప్పటికే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిట్టనిలువునా చీలిపోయింది. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ అనుబంధ సంస్థ బిఎంఎస్ లో చేరేందుకు తెరాస అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేసాడు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కెసిఆర్ లాంటి బలమైన నాయకుడికి ఎదురెళ్లి, అదీ ఎన్నికలకు ఇంకో 4 సంవత్సరాల సమయం ఉండగా, అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని వేళ ఏ ధైర్యం, అండ చూసుకొని అశ్వత్తామ రెడ్డితోపాటు కార్మికులంతా సమ్మెకు దిగినట్టు? కెసిఆర్ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోరని ప్రకటించినా వెరవకుండా ముందుకెలా వెళ్తున్నట్టు? మిగిలిన అన్ని కార్మిక సంఘాలు కూడా కెసిఆర్ ను కాదని తెరాస కు వ్యతిరేకంగా ఎందుకు ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తున్నట్టు? ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అనే వ్యాఖ్యలు ఆర్టీసీ నేతలు ఎందుకు చేస్తున్నట్టు?

ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆక్టివ్ పొలిటీషియన్  తెలంగాణకు గవర్నర్ గా ఉండడం కెసిఆర్ కు ఖచ్చితంగా మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఒకపక్కనేమో తెరాస బాస్ కెసిఆర్ ఏమో ప్రజలకు అందుబాటులో ఉండరు. తాను సచివాలయానికి రారు. అమెరికా ప్రసిడెంట్ ఎక్కిన ఏ విమానమైనా ఎయిర్ ఫోర్స్-వన్ అయినట్టు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అని అన్నారు. 

ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో గవర్నర్ గనుక మరింత యాక్టీవ్ గా  వ్యవహరించడం  మొదలుపెడితే, ప్రజలు ఖచ్చితంగా తమ సమస్యలను గవర్నర్ కు విన్నవించుకుంటారు. అది సోషల్ మీడియాలోనా నేరుగానా అనేది అప్రస్తుతం. కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను అనే మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు గవర్నర్ ని పలుమార్లు కలుస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. రెగ్యులర్ గా తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ తోని టచ్ లో  ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. ఇంకొన్ని రోజులైతే బీజేపీ నాయకులు ప్రజాసమస్యలపై పోరాటం పేరుతో ఉన్న అన్ని సమస్యలను ఎత్తుకొని ప్రజలను వెంటేసుకొని రెగ్యులర్ గా రాజ్ భవన్ చుట్టూ ట్రిప్పులు కొడతారు కూడా.  

గవర్నర్ నేరుగా ముఖ్యమంత్రి కి ఫోన్ చేయకుండా రవాణా శాఖా మంత్రికి ఫోన్ చేయడం ఇక్కడ గమనార్హం. తెలంగాణాలో అన్నిటికి కెసిఆర్ బాస్ అనేది జగమెరిగిన సత్యం. ఈ విషయం నేరుగా కెసిఆర్ డిసెంబర్ ఎన్నికల అనంతరం పరోక్షంగా చెప్పారు కూడా. ఇలా మంత్రికి ఫోన్ చేయడం వెనుక కెసిఆర్ ఇమేజ్ ను తగ్గించడమే ముఖ్య ఉద్దేశంగా మనకు కనపడుతుంది. 

ఎన్టీఆర్ ప్రభుత్వం అఖండ మెజారిటీ సాధించి కూడా తరువాతి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది. ఎన్నికల్లో గెలిచిన ఎలెక్టోరల్ అథారిటేరియనిజం (ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించడం వల్ల ప్రజల మద్దతు తనకు పూర్తిగా ఉందని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఆమోదిస్తారనే భావన) వల్లో లేదా నిజంగా కుముద్ బెన్ జోషీ వ్యవహారతీరువల్లనో కానీ మొత్తానికి టీడీపీ అప్పుడు కొట్టుకుపోయింది. 

ఇప్పుడు కెసిఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. కెసిఆర్ లో విశ్వాసం ఎక్కువయ్యింది. సినిమాలో డైలాగ్ మాదిరిగా నేను ఒక్క సారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కెసిఆర్. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తమిళిసై మరో కుముద్ బెన్ జోషీ కానుందా అనే సందేహం ఉత్పన్నమవ్వడం తథ్యం.