జగన్మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఇద్దరి తీరు

తెలుగు రాజకీయాల్లో యువ నేతలే హల్ చల్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జగన్ రెడ్డి దూకుడుగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా తెలంగాణ రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. తాజా రాజకీయాల్లో జగన్ రెడ్డి షురూ చేసిన తొవ్వలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నడా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఆ కథా కమామిషు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదువురి మరి.

తెలుగు రాజకీయాల్లో అవినీతి ఆరోపణల విషయంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు లెక్క లేనన్ని ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ టిడిపి వారైతే నేటి వరకు కూడా జగన్ రెడ్డి మీద లక్ష కోట్ల అవినీతి అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదే తరహాలో తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద కూడా అలాంటి ఆరోపణలు ఉన్నాయి. వసూళ్ల విషయంలో, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పిండుకోవడంలో రేవంత్ దిట్ట అంటూ తాజాగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. మై హోం రామేశ్వరరావునే బెదిరించినట్లు టిఆర్ఎస్ చెప్పిన దాఖలాలున్నాయి. అంతకంటే పెద్ద విషయం ఓటుకు కోట్లు వెదజల్లి రేవంత్ పట్టుబడిన విషయం తెలిసిందే. అటు జగన్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరి విషయాల్లో ఈ ఆర్థికపరమైన ఆరోపణల సంగతి అటుంచితే ఒక విషయంలో మాత్రం వారు ఒకరి బాటలో ఒకరు నడుస్తున్నారు.

మొన్నటికి మొన్న నంద్యల అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి మరణించారు. ఆయన వైసిపి ఎమ్మెల్యేగా గెలిచి టిడిపిలో చేరారు. ఆయన కూతరుకు మంత్రి పదవి దక్కింది. అక్కడ ఉప ఎన్నిక సమయంలో అప్పటి వరకు టిడిపిలో ఉన్న శిల్పా సోదరులు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటికే శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపి నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. కొద్ది నెలల కాలంలోనే వైసిపిలో చేరారు. అయితే జగన్మోహన్ రెడ్డి శిల్పా సోదరులకు ఒకే ఒక్క కండిషన్ పెట్టారు. అదేమంటే టిడిపి పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా సమర్పించాలి అన్నారు. దీంతో మరో ఐదేళ్లపాటు ఎమ్మెల్సీ పదవి అనుభవించే అవకాశమున్నా చక్రపాణి తన ఎమ్మెల్సీ పదవికి బహిరంగసభలోనే రాజీనామా చేశారు. ఆ లేఖను జనాలకు చూపించారు. దీంతో వెంటనే ఆయన రాజీనామా ఆమోదం పొందింది. సరే తర్వాత ఆ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయి టిడిపి గెలిచింది అది వేరే విషయం కావొచ్చు.

ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డి వేసిన బాటలోనే నడుస్తున్నట్లు కనబడుతున్నది. రేవంత్ రెడ్డి అమరావతిలో చంద్రబాబుకు పార్టీ కి రాజీనామా లేఖ ఇస్తూనే తన శాసనసభ సభ్యత్వానికి కూడా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ అందించారు. తనకు టిడిపి నుంచి వచ్చిన అన్ని పదవులకు రాజీనామాలు చేశారు. సరే ఆ రాజీనామా లేఖను చంద్రబాబు తెలంగాణ స్పీకర్ కు పంపుతారా? లేక ఆయన వద్దే ఉంచుకుంటారా? లేదంటే తెలంగాణ టిడిపి నేతలకు అందజేసి ఆ లేఖపై వారే నిర్ణయం తీసుకోండి అంటారా అనేది వేరే విషయం కావొచ్చు. కానీ జగన్ బాటలోనే ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ పదవులను త్యజించాలన్న ధోరణి రేవంత్ లోనూ కనబడింది.

ఇక ఒకవేళ చంద్రబాబు ఆ లేఖను తన వద్దే పెట్టుకుంటే... రేపోమాపో రేవంత్ రెడ్డి స్వయంగా స్పీకర్ కు మరో రాజీనామా లేఖ పంపే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే తాను ఇంతకాలం కేసిఆర్ చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలపై మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే ఫిరాయింపు రాజకీయం రేవంత్ కూడా చేస్తే జనాల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది కదా? అందుకోసం చంద్రబాబు ఆ రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్ కు పంపినా పంపకపోయినా రేవంత్ మరో లేఖను స్పీకర్ కు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ కాకపోతే రేపు.. రెండు మూడు రోజులు అటు ఇటూ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. కానీ రేవంత్ రాజీనామా జరగడం, ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనబడుతున్నది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నైతిక విలువల విషయంలో అక్కడ జగన్, ఇక్కడ రేవంత్ కొత్త ఒరవడి సృష్టించారని చెప్పవచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/jZLKb4