టిడిపిని వీడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయులతో మాట ముచ్చట సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సభకు హాజరైనారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మాజీ ఎంపి మల్లు రవి కూడా హాజరై రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు.

రేవంత్ రెడ్డిని ఈ సభ వేదిక మీద నుంచే ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ రోజు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభ ముగిసిన తర్వాత  సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ తో పాటు ఆయన అనుచరగణమంతా ఢిల్లీకి వెళ్తారు.

రేపు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండవా కప్పుకుంటారు. ఇప్పటికే ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేవంత్ ను పార్టీలో చేర్పించుకునేందుకు పార్టీ అధిష్టానం పూర్తిగా అందరు నేతలను సన్నద్ధం చేసింది. కుంతియా ఇప్పటికే తెలంగాణ నేతలందరినీ సన్నద్ధం చేశారు.

రేవంత్ రాకను ఇప్పుడు పెద్దగా ఎవరూ వ్యతిరేకించే అవకాశాలు లేకపోవడంతో రేవంత్ రాక సునాయాసమైంది.