ఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చెయ్యడాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చెయ్యడంపై గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 

 క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ఏకే ఆంటోనిని కలిసి సస్పెండ్ అంశంపై వివరణ ఇచ్చారు. అయితే  ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ తనను సస్పెండ్ చేశారని చెప్తే ఆశ్యర్యం వ్యక్తం చేసిందని సర్వే సత్యనారాయణ మీడియాకు స్పష్టం చేశారు. నిన్ను సస్పెండ్‌ చేయడమేంటని ఆంటోని అడిగినట్లు చెప్పుకొచ్చారు. డోంట్‌ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నారని తెలిపారు.

 మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియాపై విరుచుకుపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. 

తనను సస్పెండ్‌ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్‌ చేయాలని సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. తాను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని అలాంటిది తననే సస్పెండ్ చేస్తావా అంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తమ్‌ను తిడుతూ కేసీఆర్‌పై పొగడ్తలు: సర్వే టీఆర్ఎస్‌లో చేరుతారా..?

ముఖ్యమంత్రిని అవుతాననే.. ఉత్తమ్ నన్ను ఓడించాడు: సర్వే

‘‘రా చూసుకుందాం’’..గుండాగిరి, దాదాగిరి నాకు తెలుసు: ఉత్తమ్‌కు సర్వే హెచ్చరిక

‘‘నేను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌నే.. ఇంకా బ్యాట్స్‌మెన్లు వస్తారు’’: సర్వే