కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యానారాయణ టీఆర్ఎస్‌లో చేరుతారా..? అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు... మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో తనకు జరిగిన అవమానంపై మీడియా సాక్షిగా వెల్లగక్కారు సర్వే. 

ఇన్నాళ్లుగా పార్టీకి సేవ చేసినా తనను అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ పెద్దల తీరును ఎండగడుతూనే మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబసభ్యుల పనితీరును ఆకాశానికెత్తేశారు.

ఎన్నికల్లో విజయానికి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తం కష్టపడిందని ప్రశంసించారు. టీపీసీసీ నేతలకు ఉపన్యాసాలు ఇవ్వడం రాదని, కనీసం మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లడంలోనూ విఫలమయ్యారంటూ సర్వే మండిపడ్డారు. 

ఉత్తమ్‌తో పాటు అగ్రనేతలంతా ప్రచారంలో వేగంగా దూసుకెళ్లలేదని, కానీ కేసీఆర్ ఆ వయసులోనూ రోజుకు 5 సభల్లో పాల్గొంటూ ఒక్కరే సుడిగాలి పర్యటనలు చేశారని సత్యనారాయణ కొనియాడారు. ఎన్నికల్లో గెలిచామని, అధికారంలోకి వచ్చామని కేసీఆర్ ఆయన కుటుంబం ఒక్క క్షణం కూడా ఖాళీగా లేరని, ఇంకా కష్టపడుతున్నారని గుర్తు చేశారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రతిరోజూ గాంధీభవన్‌కు వచ్చి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే టీపీసీసీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న సర్వే.. ఈ వ్యాఖ్యల ద్వారా తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు చెప్పకనే చెప్పారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ముఖ్యమంత్రిని అవుతాననే.. ఉత్తమ్ నన్ను ఓడించాడు: సర్వే

‘‘రా చూసుకుందాం’’..గుండాగిరి, దాదాగిరి నాకు తెలుసు: ఉత్తమ్‌కు సర్వే హెచ్చరిక

‘‘నేను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌నే.. ఇంకా బ్యాట్స్‌మెన్లు వస్తారు’’: సర్వే