కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అధికారులకు న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
KNOW
Kancha Gachibowli Lands Case : హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ భూములపై వివాదం సాగుతోంది… ప్రభుత్వం కూడా చదునుచేసే పనులను నిలిపివేసింది. కానీ కేవలం పనులు ఆపడంకాదు... ద్వంసంచేసిన పర్యావరణాన్ని తిరిగి పునరుద్దరించాలని అధికారులను న్యాయస్థానాలు సూచిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను తీవ్రంగా హెచ్చరించాయి న్యాయస్థానాలు... ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు ఈ భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల కేసును ఇవాళ (బుధవారం) సుప్రీంకోర్టు విచారించింది. సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని భూముల్లో చెట్లను నరికేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది... రాత్రికి రాత్రి అడవిని ధ్వంసం చేయాలని చూశారని అధికారులపై మండిపడింది. ఇప్పటికే ఈ భూముల్లో పనులను నిలిపివేసామని చెప్పినా న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఇప్పటికే చెట్లను కొట్టేయడంతో అడవులు నశించి పోతున్నాయని... పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్. గవాయ్ పేర్కొన్నారు. అడవులను నాశనం చేస్తే ఇక సహించేది లేదని... కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవిని పునరుద్దరించాలని సూచించారు. లేదంటే అక్కడే తాత్కాలిక జైలు నిర్మించి సంబంధిత అధికారులను అందులో వేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
కంచ గచ్చబౌలి భూముల కేసు ఆగస్ట్ 13కి వాయిదా
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ భూముల్లోని చెట్లను తొలగించి ఉపయోగించుకోవాలని చూడగా హెచ్సియు విద్యార్థులు, ప్రతిపక్షాలు, పర్యావరణ ప్రేమికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఈ చెట్ల నరికివేత పనులను ఆపించాయి. ఆ సమయంలోనే ఏకంగా సీఎస్, ఇతర ఉన్నతాధికారులను జైల్లో పెట్టాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
ఇక ఈ కంచబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుని విచారణ చేపట్టింది. స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. గత విచారణలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ ఈ భూములకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును ప్రభుత్వం అందించింది. అలాగే ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలుచేసింది. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం విచారణను ఆగస్ట్ 13క వాయిదా వేసింది.
