Hyderabad: రేవంత్ సర్కారుకు సుప్రీం మొట్టికాయలు.. HCU భూములపై ఆగ్రహం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్థలంలో ఉన్న చెట్లను తొలగించి ఐటీ కంపెనీలకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే చెట్ల నరికివేత ప్రారంభించింది. అయితే అటు హెచ్‌సీయూ విద్యార్థులు, ఇటు ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. దీంతో ఈ అంశం సుప్రీం కోర్టు వరకు చేరింది. అయితే తాజాగా బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం రేవంత్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Supreme Court Slams Telangana Govt
కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిన చెట్ల నరికివేతపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నిస్తూ.. 'ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికే హక్కు ఎవరిచ్చారు? పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ అనేది ఉండదు' అని తేల్చి చెప్పారు. చెట్ల పునరుద్ధరణకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను వెంటనే సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అలాగే, నరికివేత చేసిన 100 ఎకరాల భూమిని ఎలా పునరుద్ధరిస్తారో తెలియజేయాలన్నారు.
చెట్ల నరికివేతకు సంబంధించిన ప్రక్రియపై అనుమతులు తీసుకున్నారా అని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకున్నట్టు తేలితే, ముఖ్య కార్యదర్శితో సహా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. “వాటిని పునరుద్ధరించాలంటే టెంపరరీ జైలులు కట్టి వారిని అక్కడే ఉంచుతాం,” అంటూ సుప్రీం ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.
HCU Lands
ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.
అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ..'అన్ని పనులను నిలిపివేశాం. మినహాయింపులకు లోబడే చెట్లను మాత్రమే తొలగించాం. ఫేక్ వీడియోలతో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాయి'అని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక కేసు విచారణలో భాగంగా స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీం పేర్కొంది.
అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మార్చకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అంతేకాకుండా, పునరుద్ధరణకు సంబంధించి నాలుగు వారాల్లోగా పూర్తి ప్రణాళికతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో వన్యప్రాణుల రక్షణకు తీసుకునే చర్యల వివరాలు కూడా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో సమర్పించిన కౌంటర్‌లో.. 'ఈ భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కొన్ని పొదలు పెరిగినవి. ఈ భూముల్లో జంతువులు లేవు. పక్షులు యూనివర్శిటీ నుంచి ఇక్కడికి వలస వచ్చాయి. కంచెలు లేకపోవడం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి' అని పేర్కొంది.
HCU, Supreme Court, Telangana
తాకట్టు గురించి కాదు మా ఆలోచన అంతా చెట్ల నరికివేతపై ఉంది: సుప్రీం
కాగా.. న్యాయవాది పరమేశ్వర్ భూముల అంశం గురించి ధర్మాసనానికి వివరిస్తూ.. ఈ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు తాకట్టు పెట్టిన విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఈ విషయమై అవగాహన ఉందని, ఈ తాకట్టు ప్రక్రియకు వీలుగా ప్రత్యేకంగా కొన్ని బాండ్లు సృష్టించారని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశంపై ధర్మాసనం స్పందిస్తూ .. మేము ఆ భూమి తాకట్టు అంశం గురించి ఆలోచిండచం లేదని, పర్యావరణ నాశనం, చెట్ల నరికివేతపై మాత్రమే దృష్టి పెడుతున్నాం. అనుమతులు లేకుండా ఎంత మేర చెట్లు తొలగించబడ్డాయన్న దానిపైనే విచారణ కొనసాగుతుంది అని తేల్చి చెప్పింది.
The Supreme Court of India
ఇక 100 ఎకరాల భూమిలో జరిగిన అడవి ధ్వంసంతో ప్రభావితమైన వన్యప్రాణుల రక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌ను కోర్టు ఆదేశించింది. పునరుద్ధరణ కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లక తప్పదని ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. మరి సుప్రీం ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.