తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డు మీద వెడుతున్న ఓ చిన్నారి వెంట పడ్డాయి. సమయానికి ఓ వ్యక్తి వాటిని తరిమికొట్టడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
సిద్ది పేట : తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్టుగా కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా కోహెడలో వీధి కుక్కల దాడినుంచి ఓ బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆ చిన్నారి స్కూల్ యూనిఫాంలో ఏదో తేవడానికి చేతిలో గిన్నెతో వెడుతోంది.. ఆమెను చూసిన రెండు కుక్కలు వెంటపడ్డాయి. వాటిని చూసి భయపడ్డ ఆ చిన్నారి వెంటనే పరుగు అందుకుంది. పరుగులు పెట్టడంతో అవి కూడా ఆ అమ్మాయిని వెంటాడాయి.
దీంతో మరింత భయాందోళనలకు గురైన ఆ చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ పరుగు పెట్టడం మొదలుపెట్టింది. ఆ కేకలు విన్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న వస్తువుతో కుక్కలను కొట్టాడు. వాటిని దూరంగా వెళ్లేట్టు బెదిరించడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో చిన్నారి తప్పించుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అది చూసిన స్థానికులు, చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతంలో ఉన్న వీధి కుక్కలను తొలగించాలని చాలా రోజులుగా కోరుతున్నామని చెప్పారు.
ఆ విషయంలో తొలి ముద్దాయి కేసీఆరే.. సీఎం పదవికి రాజీనామా చేయాలి: బండి సంజయ్
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం చెన్నైలో ఓ మహిళ పిలియన్ రైడ్ చేస్తూ కుక్కల దాడిలో గాయపడి మరణించింది. క్రోమ్‌పేట నివాసి (55) అయిన ఆ మహిళ వారం రోజుల క్రితం బైక్ మీద పిలియన్ రైడ్ చేస్తోంది. ఆ బైక్‌ను వీధికుక్కల గుంపు వెంబడించడంతో.. బండిమీదినుంచి జారి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం మరణించింది. మృతి చెందిన మహిళను తేన్‌మొళిగా గుర్తించిన పోలీసులు ఆమె తన కొడుకుతో బైక్‌పై ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
తేన్‌మొళి క్రోమ్‌పేట్‌లోని రాధా నగర్‌లో నివాసి. అక్కడికి సమీపంలోఉన్న లైబ్రరీలో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 24న, ఆమె కుమారుడు, ఆమె గాంధీ నగర్ గుండా వస్తుండగా వీధికుక్కల గుంపు వెంబడించింది. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో, ఆమె కొడుకు బండి వేగం పెంచాడు. దీంతో వెనుక కూర్చున్న తేన్మొళి, బ్యాలెన్స్ తప్పి, జారి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో ఆమెను పోరూర్‌లోని ఎస్‌ఆర్‌ఎంసి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేసిన తర్వాత, సంఘటనకు దారితీసిన ప్రాంతంలో వీధికుక్కల బెడదపై నివేదిక ఇస్తామని సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి ఘటనే జనవరిలో జరిగింది. ఒక పాఠశాల విద్యార్థిని ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఒక వీధికుక్క వెంబడించడంతో తన సోదరి స్కూటీ వెనక కూర్చున్న ఆమె బండి మీదినుంచి జారిపడిపోయింది.
తాంబరం, క్రోమ్‌పేట, పల్లవరం, హస్తినాపురం, సెలైయూర్, పమ్మల్, పొజిచలూరు పరిసర ప్రాంతాల్లో వీధికుక్కల బెడదపై స్థానికులు నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కుక్కల వల్ల యువకులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ జనవరి 31న పల్లావరంలోని తాంబరం కార్పొరేషన్ జోనల్ కార్యాలయం వద్ద సామాజిక కార్యకర్త వి సంతానం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
