థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం ఉన్నది, కేసీఆర్ చొరవ తీసుకోవాలి: ఒవైసీ కీలక వ్యాఖ్యలు
‘థర్డ్ ఫ్రంట్‌కు ఇంకా అవకాశం ఉన్నది. ఎన్డీయే, ఇండియా కూటమిలో చేరని కీలక పార్టీలు ఉన్నాయి. కేసీఆర్ ఇందుకు చొరవ తీసుకుని ముందడుగు వేయాలి’ అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

న్యూఢిల్లీ: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ రూపం దాల్చడానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘ఇప్పటికీ థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం ఉన్నదని నేను అనుకుంటాను. మాయావతి, కేసీఆర్ వంటి నేతలు అందులో లేరు. ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో చేరని రాజకీయ ప్రాధాన్యం ఉన్న పార్టీలు ఇంకా ఉన్నాయి. కాబట్టి, కేసీఆర్ ముందడుగు తీసుకోవాలి. మార్పును తీసుకురావాలి’ అని ఒవైసీ అన్నారు.
హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం గురించి ఒవైసీని ప్రశ్నించగా.. ‘సీడబ్ల్యూసీ దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నది. కానీ, ముస్లింల సంగతేంటి? వారు మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ఇదే విషయాన్ని పార్లమెంటులో పలుమార్లు మాట్లాడాను’ అని చెప్పారు.
‘కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు చేసిందేమిటీ? ఛత్తీస్‌గడ్, రాజస్తాన్‌లలో వారు మైనార్టీలకు ఏం చేశారో చూపించండి?’ అంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.‘హర్యానాలో జునైద్, నాసిర్‌లను సజీవ దహనం చేసి చంపేస్తే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. అదే రాజస్తాన్‌లో ఉగ్రవాదుల చేతిలో కన్హయ్య లాల్ మరణిస్తే వారి కుటుంబానికి రూ. 50 లక్షలు ఇచ్చారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంలోనూ కాంగ్రెస్ పార్టీ వివక్ష వహిస్తుంది’ అని అన్నారు.
‘కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయి. ఆర్థికం కుంగిపోయింది. కానీ, తెలంగాణలో పరిస్థితులు వేరు. ఇక్కడ ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్లుతుంటే ఎవరూ అడ్డుకోరు. ముస్లింలను ఇక్కడ మూకదాడి చేసి చంపేయడం లేదు. ఆర్థికం కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణ, కర్ణాటక కాదు’ అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడుతూ కామెంట్ చేశారు.