భారత్‌పైకి యుద్ధానికి వస్తే.. మీ పిల్లలను వేరేవాళ్లు పెంచాల్సిందే: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్
భారత్‌తో యుద్ధానికి వస్తే మీ పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శత్రుమూకలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఐదో రోజులోకి ప్రవేశిస్తున్న సందర్భంలో కేంద్రమంత్రి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్‌లో తీవ్రవాదులతో ఎన్‌కౌంటర్ ఐదో రోజులోకి ప్రవేశించింది. ఈ సందర్భంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారత శత్రువులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ యుద్ధానికి కోరుకోదని, కానీ, ఎవరైనా ఈ దేశంపైకి యుద్ధానికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు సిద్ధపడాలని అన్నారు. ఎవరైతో భారత్ పై యుద్ధానికి వస్తారో వారి పిల్లలను వేరేవాళ్లు పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కొత్త భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదని, గట్టిగా నిలబడుతుందని వివరించారు.
భారత ఆర్మీ ఆధునిక ఆయుధాలు, నిఘా, శక్తి సామర్థ్యాలను గురించి చర్చిస్తున్న ఓ ట్వీట్‌కు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రెస్పాండ్ అయ్యారు. ‘భారత్‌కు శత్రువులున్నారు. భారత్ ఎదగడం ఆ శత్రువులకు మింగుడుపడటం లేదు. కానీ, వాళ్లు ఒక విషయం తెలుసుకోవాలి. భారత ఆర్మీ ఇప్పుడు ఆధునికమైన, ఉన్నత సాంకేతిక, శక్తివంతమైన మెషీన్ వంటిది. ఇందులో పొరబడొద్దు. తెలివికలవారైతే భారత్‌తో పెట్టుకోవద్దు. ఇది కొత్త ఇండియా. కొత్త ఇండియాను ఎవరూ బెదిరించలేరు. ఈ నూతన భారత్ వెనుకడుగు వేయదు. ఇండియాకు యుద్ధాలను చూసిన అనుభవం ఉన్నది. యుద్ధానికి వెళ్లాలని భారత్ కోరుకోదు. కానీ, ఎవరైనా భారత్‌తో కయ్యానికి దిగితే మాత్రం వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : వాస్తు దోషం తొలగిస్తామని మహిళ పై పలుమార్లు లైంగిక దాడి.. ఏం చేశారంటే?
మంగళవారం మొదలైన అనంత్‌నాగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ అశిశ్ దొంచాక్, జమ్ము కశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్, రైఫిల్ మ్యాన్ రవి కుమార్ రాణాలు ఉన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లు ఆ ప్రాంతాన్ని మోహరించాయి. కొంకర్నాగ్ ఏరియాలోని గడోల్‌లో దాక్కున్న టెర్రరిస్టులను ఇవి గాలిస్తున్నాయి. ఆపరేషన్ చివరి స్టేజ్‌కు వచ్చిందని, త్వరలోనే ఆ ముష్కరులను మట్టుబెడతామని అధికారులు వివరించారు.