జగిత్యాలలో సంచలనం సృష్టించిన టెక్కీ దీప్తి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆమె చెల్లెలు చందననే అక్కను హత్య చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది.  ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు

జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి (24) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెను సొంత చెల్లెలే హతమార్చిందని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు వివరించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు.

స్కార్ఫ్‌తో ముఖాన్ని కప్పేసి, నోటికి ప్లాస్టర్ వేసి దీప్తిని హతమార్చినట్లు ఎస్పీ వెల్లడించారు. దీప్తి సోదరి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్, అతని తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్‌తో కలిసి ఈ హత్యలో పాలు పంచుకున్నారు. హత్య అనంతరం వోడ్కా తాగి చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1గా చందన, ఏ2గా షేక్ ఉమర్‌లను చేర్చినట్లుగా ఆయన తెలిపారు.

Also Read: కోరుట్ల దీప్తి కేసు : ప్రేమ వద్దన్నందుకు.. అక్కను దారుణంగా హతమార్చిన చెల్లి చందన...

స్థానికంగా వుండే ఉమర్‌తో చందన ప్రేమలో పడిందని.. అయితే మతాంతర వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదని భాస్కర్ చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చందన తన ప్రియుడితో లేచిపోయేందుకు ప్రయత్నించింది. ఇంట్లో వున్న బంగారం, నగదును సర్దుకుని వెళ్లిపోతుండగా దీప్తి అడ్డుపడింది. దీంతో అక్క అన్న ప్రేమ, జాలి లేకుండా ఆమెను చందన తన ప్రియుడితో కలిసి చంపిందని ఎస్పీ చెప్పారు. డబ్బు, బంగారంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయిందని.. అయితే కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం, తమ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలియడంతో వారు మకాం మార్చారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో చందన, ఆమె ప్రియుడిని పట్టుకున్నట్లు ఎస్పీ చెప్పారు. 

దీప్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించే క్రమంలో ఎక్కడా ట్రాక్ తప్పలేదు. ఈ క్రమంలోనే దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి.. కూతురి మృతి విషయంలో తన చిన్న కూతురు చందన, మరో యువకుడి మీద అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు చేశారు. మూడు నాలుగు బృందాలుగా పోలీసులు విడిపోయి చందన కోసం వెతికారు.

Also Read : కోరుట్ల దీప్తి కేసులో పురోగతి .. ఒంగోలులో చందన, బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్

టెక్నాలజీ సహాయంతో చందన ఒంగోలు వైపు వెళుతున్నట్లుగా తెలియడంతో అప్రమత్తమయ్యారు. టంగుటూరు లోని టోల్గేట్ ను దాటి ఆలకూరపాడు వైపు చందన వెడుతున్నట్లుగా గుర్తించి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒంగోలులోని ఓ లాడ్జిలో చందన మిగతా వారితో దొరికింది. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకొని జగిత్యాల పోలీసులకు అప్పగించారు.

నిందితులందరినీ జగిత్యాల తీసుకువచ్చిన పోలీసులు విచారించారు. అక్కను ఎందుకు చంపాల్సి వచ్చిందో చందన ఇలా వివరించింది.. హైదరాబాదులోని ఓ ప్రైవేటు కాలేజీలో చందన బీటెక్ చదువుకుంది. ఆ సమయంలోనే తన కాలేజీలో చదువుకునే సీనియర్ తో ప్రేమలో పడింది. వీరిద్దరి మతాలు వేరు. దీంతో వీరి ప్రేమకు చందన తల్లిదండ్రులతో పాటు అక్క దీప్తి కూడా ఒప్పుకోలేదు.