కోరుట్ల దీప్తి కేసు : ప్రేమ వద్దన్నందుకు.. అక్కను దారుణంగా హతమార్చిన చెల్లి చందన...
జగిత్యాలలో సంచలనం సృష్టించిన టెక్కీ దీప్తి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆమె చెల్లెలు చందననే అక్కను హత్య చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది.

Korutla
జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్లలో దీప్తి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుమానాస్పదం మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. దీప్తిని ఆమె సోదరి చందననే ప్రేమ వ్యవహారం వల్ల హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. ప్రాథమిక విచారణలో దీప్తి సోదరి చందన తన నేరాన్ని అంగీకరించినట్లుగా సమాచారం.
Korutla
శనివారం సాయంత్రం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టబోతున్నారు. చందన తన ప్రియుడితో వెళ్లిపోయే క్రమంలో.. దీప్తి ముక్కు, నోరుకు ప్లాస్టర్ వేసిన చందన.. ఆ తర్వాత చున్ని చుట్టి ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ మేరకు చందన పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లుగా సమాచారం. కోరుట్లలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి (24) మృతి కేసులో మొదటి నుండి ఆమె సోదరి చందన మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సోదరి చందన, ఆమె ప్రియుడు, ప్రియుడి తల్లి, అతని తరపు మరో బంధువు, కారు డ్రైవర్లను దీప్తి మృతి కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…. కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక దీప్తి ఆగస్టు 29వ తేదీన వారి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. మరోవైపు అదే రోజు రాత్రి ఆమె దీప్తి చెల్లెలు చందన కనిపించకుండా పోయింది. ఆరోజు రాత్రి చందన ఓ యువకుడితో కలిసి బస్టాండ్ నుంచి నిజామాబాదుకు వెళుతున్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.
Korutla
మరోవైపు దీప్తి మృతి కేసు వెలుగులోకి రావడం… చందన కనిపించకుండా పోవడంతో అనుమానాలు ఆమె వైపు చూపించాయి.ఇంకోవైపు ఇంట్లో మందు బాటిల్స్ దొరికాయి. ఇక ముందుగా అనుకున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది చందన కాదని ధారణ అయింది. దాంతోపాటు చందన దీప్తిని తాను చంపలేదంటూ వాయిస్ మెసేజ్ ను తన సోదరుడికి పంపించింది. చందన ఆచూకీ దొరికే విషయంలో రకరకాల ప్రచారాలు.. మొత్తంగా కేసును మరింత గందరగోళంలో పడేసాయి.
వీటన్నింటి నేపథ్యంలో దీప్తి సోదరి చందన దొరికితే తప్ప ఈ కేసు మిస్టరీ వీడదని పోలీసులు భావించారు. దీప్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించే క్రమంలో ఎక్కడా ట్రాక్ తప్పలేదు. ఈ క్రమంలోనే దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి.. కూతురి మృతి విషయంలో తన చిన్న కూతురు చందన, మరో యువకుడి మీద అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు చేశారు.
Korutla
మూడు నాలుగు బృందాలుగా పోలీసులు విడిపోయి చందన కోసం వెతికారు. టెక్నాలజీ సహాయంతో చందన ఒంగోలు వైపు వెళుతున్నట్లుగా తెలియడంతో అప్రమత్తమయ్యారు. టంగుటూరు లోని టోల్గేట్ ను దాటి ఆలకూరపాడు వైపు చందన వెడుతున్నట్లుగా గుర్తించి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒంగోలులోని ఓ లాడ్జిలో చందన మిగతా వారితో దొరికింది. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకొని జగిత్యాల పోలీసులకు అప్పగించారు.
నిందితులందరినీ జగిత్యాల తీసుకువచ్చిన పోలీసులు విచారించారు. అక్కను ఎందుకు చంపాల్సి వచ్చిందో చందన ఇలా వివరించింది.. హైదరాబాదులోని ఓ ప్రైవేటు కాలేజీలో చందన బీటెక్ చదువుకుంది. ఆ సమయంలోనే తన కాలేజీలో చదువుకునే సీనియర్ తో ప్రేమలో పడింది. వీరిద్దరి మతాలు వేరు. దీంతో వీరి ప్రేమకు చందన తల్లిదండ్రులతో పాటు అక్క దీప్తి కూడా ఒప్పుకోలేదు.
Korutla
ఇదే విషయం మీద దీప్తితో చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గొడవ పడింది. ఆ క్రమంలోనే చందన.. అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్లు వేసింది. దీంతోనే ఊపిరి ఆడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చందన, ఆమెతో పాటు ఉన్న ముగ్గురిని ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. దీప్తి పోస్టుమార్టం రిపోర్టు సాయంత్రం కల్లా వస్తుంది. ఆ తరువాత డిఎస్పీ భాస్కర్ ఈ కేసు కు సంబంధించి వివరాలను, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.