బంగారు తెలంగాణలో నల్ల బంగారం పండించే కార్మికులు కన్నెర్రజేశారు. సర్కారు వారి బంగారు మాటలతో మాకు కడుపు నిండదని తేల్చి చెప్పారు. ఈనెల 15 నుంచి సమరానికి సై అంటూ... సమ్మెకు దిగుతున్నారు. గని కార్మికుల సమర శంఖారావం గులాబీ కోటను వణికిస్తుందన్న ప్రచారం సాగుతోంది.
సింగరేణి లో సమ్మె సైరన్ మోగింది. అధికార పార్టీ అనుబంధ సంఘమైన టిఆర్ఎస్ కెవి తప్ప మిగతా సంఘాలన్నీ సమ్మెకు దిగుతున్నాయి. సిఐటియు, ఎఐటియుసి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన వాటిలో ఉన్నాయి. మంగళవారం సాయంత్రం తుది చర్చలు విఫలం కావడంతో... గురువారం నుంచి సమ్మె షురూ కానుంది.
సింగరేణి కార్మికులను ఏదో గొప్పగా చూస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిక తీరు ఉండడం పట్ల కార్మికులు రగలిపోతున్నారు. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ సర్కారు ఊదరగొట్టి... తూ.తూ.మంత్రంగా చర్యలకు దిగడంతో న్యాయస్థానాల్లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. కేవలం మాటలతో కాలయాపన చేయడం పట్ల తెలంగాణ సర్కారుపై గత మూడేళ్ల నుంచి కార్మికులు గుర్రుగానే ఉన్నారు.
తక్షణమే వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మార్చి 31 న సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు
మంగళవారం తుది విడత సింగరేణి యాజమాన్యం తో జరిపిన చర్చలు విఫలం
రాష్ట్ర ప్రభుత్వం అనవసర రాజకీయ జోక్యం ఫై కార్మికుల మండిపడుతున్నారు.
సమ్మె విచ్చిన్నం కు ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు.
సింగరేణి కార్మిక సంఘాల సమ్మె నోటీసు తెలంగాణ సర్కారును, గులాబీ వనాలను కలవరపాటుకు గురిచేస్తున్నది. సింగరేణి కార్మికుల తడాఖా ఏంటో తెలంగాణ ఉద్యమం సమయంలో యావత్ భారత జాతికి తెలిసి పోయింది. వారు సమ్మె చేస్తే.... దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావం ఉంటుందో తెలంగాణ ఉద్యమంలో వారు చాటి చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సింగరేణి, ఆర్టీసి కార్మికులే ఉద్యమ సెగను భారత ప్రభుత్వానికి తాకేలా చేశారని టిఆర్ఎస్ శ్రేణులు అంటుంటారు.
మూడేళ్ల పాటు మౌనంగా భరించిన బొగ్గుగని కార్మికులు ఇప్పుడు భగ్గుమంటున్నారు. వారు సమ్మె చేస్తే... సర్కారుకు కొత్త తలనొప్పులు తప్పవన్న చర్చ ఉంది. తెలంగాణ ఉద్యమ ఫలమే టిఆర్ఎస్ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి తోడ్పడింది. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం (టిఆర్ఎస్ కెవి) తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నది.
కానీ ఇప్పుడు సమ్మె నోటుసు నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఏవిధంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
