హైద్రాబాద్‌ను ముంచెత్తిన వాన: నీట మునిగిన పలు కాలనీలు, కొట్టుకుపోయిన వాహనాలు
హైద్రాబాద్ లో కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్: మూడు రోజులుగా హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైద్రాబాద్ కృష్ణా నగర్ లో వరద నీటితో బైక్ లు కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో వర్షం నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ వరద నీటిలో ఓ ఆటో, బైక్ కొట్టుకుపోయింది.
కూకట్ పల్లి దీనదయాళ్ నగర్ , ఖైరతాబాద్ లోని చింతల్,నాగోల్, ఎల్ బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. నిజాంపేటలోని ఈశ్వర్ విల్లాలో ఐదు అడుగుల మేర వరద నీరు చేరింది. ఫతేనగర్ లో రోడ్లపైకి చేరిన వరద నీరు చేరింది. దూలపల్లిలోని గంగస్థాన్ ప్రహరీగోడ కూలిపోయింది. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు, మంచినీళ్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. హైద్రాబాద్ కు ఇవాళ రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ ఏడాది ఆగస్టు మాసంలో సాధారణ వర్షపాతం కూడ నమోదు కాలేదు. కానీ, జూలై మాసంలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈశాన్య బంగాశాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
also read:అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హైద్రాబాద్‌లో భారీ వర్షాలపై తలసాని సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైద్రాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోని స్కూళ్లకు ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. హైద్రాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.