అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హైద్రాబాద్‌లో భారీ వర్షాలపై తలసాని సమీక్ష
హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న బారీవర్షాలపై అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు సూచనలు చేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి కోరారు. నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని ఆయన కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మంత్రి అధికారులను కోరారు.కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్ కో సీఎండీలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిస్థితిని సమీక్షించారు. వర్షాలకు కూలిన చెట్లు, వాటి కొమ్మలను వెంటనే తొలగించాలని మంత్రి సూచించారు.
also read:హైద్రాబాద్‌లో భారీ వర్షం: టోలిచౌకి-మెహిదీపట్నం మార్గంలో రాకపోకలు బంద్
అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.మూడు రోజులుగా హైద్రాబాద్ లో కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
ఇవాళ ఉదయం నుండి నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ నాలుగైదు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ గా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.