మేడారం సమ్మక్క-సారక్క జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లిని గద్దెల వద్దకు తీసుకొచ్చారు. దీంతో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెలపై కొలువుదీరినట్లు అయ్యింది. వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో మేడారం జనసంద్రమైంది.

మరోవైపు సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో అధికారులు కాసేపు దర్శనాలు నిలిపివేశారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతించారు. ఎల్లుండి సాయంత్రం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. 

గోవిందరాజు, పగిడిద్దరాజులతో పాటు సారలమ్మ గద్దెపైకి చేరుకొంది. బుధవారం నాడు అర్ధరాత్రి  మేడారం జాతరలో  సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొన్నారు.

Also Read:మేడారం జాతర ప్రారంభం: గద్దెపైకి చేరిన సారలమ్మ

భక్తులు సారలమ్మకు ఎదురేగి జయజయద్వానాలు చేశారు. సారలమ్మను దర్శించుకొన్నారు. సారలమ్మను కన్నెపల్లి ఆలయం నుండి మేడారంలోని గద్దెపైకి బుధవారం నాడు అర్ధరాత్రి తీసుకొచ్చారు.

Also Read: మేడారం జాతరకు కరోనా వైరస్ ముప్పు..?

బుధవారం నాడు సాయంత్రం కన్నెపల్లి ఆలయం నుండి మొంటెలో సారలమ్మ దేవతను తీసుకొని గ్రామస్తులు ఊరేగింపుగా బయలుదేరారు.  నాలుగు కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తూ రాత్రి జంపన్నవాగు దాటి ఇవతలకు చేరుకొన్నారు.

ఇవతలి ఒడ్డులో ఉన్న సమ్మక్క ఆలయం వద్ద  పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు,  కొండాయి నుండి గోవిందరాజును పూజారులు తీసుకొచ్చారు. సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ముగ్గురిని బుధవారం నాడు రాత్రి 12 గంటల 25 నిమిషాలకు గద్దెలపై ప్రతిష్టించారు.