వరంగల్: మేడారం జాతరలో తొలి ఘట్టం ప్రారంభమైంది. గోవిందరాజు, పగిడిద్దరాజులతో పాటు సారలమ్మ గద్దెపైకి చేరుకొంది. బుధవారం నాడు అర్ధరాత్రి  మేడారం జాతరలో  సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొన్నారు.

 భక్తులు సారలమ్మకు ఎదురేగి జయజయద్వానాలు చేశారు. సారలమ్మను దర్శించుకొన్నారు. సారలమ్మను కన్నెపల్లి ఆలయం నుండి మేడారంలోని గద్దెపైకి బుధవారం నాడు అర్ధరాత్రి తీసుకొచ్చారు.

బుధవారం రాత్రి 12గంటల 20 నిమిషాల తర్వాత సారలమ్మను గద్దెపై నిలిపారు. మేడారం జాతరను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించారు. 

బుధవారం నాడు సాయంత్రం కన్నెపల్లి ఆలయం నుండి మొంటెలో సారలమ్మ దేవతను తీసుకొని గ్రామస్తులు ఊరేగింపుగా బయలుదేరారు.  నాలుగు కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తూ రాత్రి జంపన్నవాగు దాటి ఇవతలకు చేరుకొన్నారు.

ఇవతలి ఒడ్డులో ఉన్న సమ్మక్క ఆలయం వద్ద  పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు,  కొండాయి నుండి గోవిందరాజును పూజారులు తీసుకొచ్చారు. సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ముగ్గురిని బుధవారం నాడు రాత్రి 12 గంటల 25 నిమిషాలకు గద్దెలపై ప్రతిష్టించారు.