కరోనా  ప్రస్తుతం.. దేశ విదేశాలన్నింటినీ వణికిస్తున్న పేరు అది. ఈ వైరస్ పేరు చెబితే చాలు ప్రజలు భయబ్రాంతులతో వణికిపోతున్నారు. చైనాలో మొదలైన ఈ కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా పాకేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో 180మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4వేల మందికి పైగా ఈ వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల ఈ వైరస్ భారత్ కి కూడా పాకింది. కేరళకు చెందిన  ఓ విద్యార్థికి ఈ వైరస్ సోకడంతో చికిత్స అందిస్తున్నారు. అయితే... ఈ ముప్పు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మేడారం జాతర, తిరుమల ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఈ వైరస్ పాకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వచ్చే నెలలో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే... ప్రతి రోజూ లక్షల్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకు కరోనా వైరస్ సోకిన ఒక్క వ్యక్తి వచ్చినా పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని పలువురిలో భయం మొదలైంది.

ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మేడారంకు వచ్చే భక్తుల పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అటు తిరుపతిలో కూడా ప్రత్యేక మెడికల్ క్యాంపుల ద్వారా సహాయక చర్యలకు అధికారులు సిద్దమయ్యారు.

Also Read కరోనా వైరస్ ఎఫెక్ట్: గాంధీలో ఒకరికి పరీక్షలు, భయం ఇదీ.

కాగా, దేశంలో రెండవ కుంభమేళగా పేరుగాంచిన మేడారం మహాజాతర వచ్చేనెల 5వ తేదీన ప్రారంభం కానుంది. 8వ తేదీ వరకు జరుగే ఈ జాతరకు.. దాదాపు కోటి నుంచి కోటిన్నర మంది భక్తులు హాజరువుతారని అధికారుల అంచనా. ఇక్కడికి కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పొరుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. 

అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఒకేచోట గుమికూడే ఈ జాతరలో కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో అధికారులు జాతరకు వచ్చే భక్తులకు పాటించవల్సిన ముందస్తు జాగ్రత్తలు, కరోనా వైరస్ వ్యాపించకుండా రక్షణ చర్యలపై భక్తులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పిస్తోంది. జాతర ప్రాంగణంతోపాటు, మేడారంకు చేరుకునే అన్ని మార్గాలలో కరోనా వైరస్ అవగాహనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.