బతుకమ్మ నింపిన విషాదం సూర్యాపేట మహిళ హైదరాబాద్ లో మృతి

బతుకమ్మ వేడుకలు ఆ ఇంట్లో విషాదం నింపాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆ మహిళ అప్పటి వరకు సంతోషంగా ఆడిపాడింది. తీరా అంతలోనే అనంత వాయువుల్లో కలిసి పోయింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుుకలకు వచ్చిన ఆ మహిళ తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయింది. వివరాలిలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన నగేష్ సతీమణి సృజన (24) హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఆడేందుకు గ్రామస్తులందరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్ లో వచ్చారు. ఎల్బీ స్టేడియంలో అందరితో కలిసి ఆడిపాడి తిరుగు ప్రయాణం అయ్యారు.

అందరూ తిరిగి బస్సు ఎక్కిన తర్వాత బస్ కదలింది. ఈ సమయయంలో సృజన కిటికీలోంచి నీళ్ల బాటిల్ తో మొహం కడుక్కుంటున్నది. ఆ విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకుండా బస్సును నడిపించాడు.

అసెంబ్లీ గేటు సమీపంలోని మహబూబియా గేటు ఆ మహిళ తలకు బలంగా రాసుకుపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

బతుకమ్మ కోసం తమతో వచ్చి ప్రాణాలు కోల్పోయినదని గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.