తెలంగాణలో జిల్లాల కుదింపు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. దీనిపై సర్వాధికారాలు రాష్ట్రాలకే ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటు... 10 జిల్లాల తెలంగాణ ను ఏకంగా 31 జిల్లాలకు పెంచారు... దసరా పండగ శుభసందర్భాన అట్టహాసంగా కొత్త జిల్లాలన్నింటిని ఏకకాలంలో ప్రారంభించారు.
కొత్త జిల్లాలు ఏర్పడి ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తికాలేదు. అప్పుడే ఈ జిల్లాల సంఖ్యను కుదించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ గా మారింది.
జిల్లాలను కుదించాలని కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిందట. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకుగాను 21 జిల్లాలుగా కుదించాలని సూచించిందట. దీనికి కేంద్రం చెబుతున్న కారణం... కేంద్ర సర్వీసు అధికారులను కేటాయించడం కష్టమవడమేనట.
కొత్త జిల్లాలకు ఐఎఎస్, ఐపిఎస్ లతోపాటు ఇతర కేంద్ర సర్వీసు అధికారులను కేటాయించడం అసాధ్యమని అందువల్ల జిల్లాలను తగ్గించాలని చెప్పిందట. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ఇవ్వనుందట.
అయితే ఈ జిల్లాల కుదింపు వార్త ఊహాగానాలా లేక విశ్వసనీయ సమాచారమా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ, జిల్లాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం ఉంటుందా... సెంట్రల్ గవర్నమెంట్ చెబితే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కుదించాల్సిందేనా..... జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల కేంద్రానికి వచ్చే ఇబ్బందులు ఏంటీ ..
ఒకసారి పరిశీలిస్తే...
అసలు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనేది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం... జిల్లాల ఏర్పాటు కుదింపు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇందులో కేంద్రం జోక్యం అసలే ఉండదు. ఇందులో సర్వాధికారులు రాష్ట్రానివే.
ఇక జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల కేంద్రానికి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. తెలంగాణ కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలలో కూడా ఎక్కువ జిల్లాలే ఉన్నాయి.
తెలంగాణలో ప్రతి 11 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉండగా, మిజోరంలో 1.37 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో కేవలం 67 వేల మందికి సగటున ఒక జిల్లా ఉంది.
