హైదరాబాద్: తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు రోజు డిపోల వద్దకు రావడం వారిని పోలీసులు అడ్డుకోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. డిపోల వద్దకు వచ్చిన కార్మికులు కనీటిపర్యంతమవుతున్న దృశ్యాలు సాధారణ ప్రజల గుండెలను కూడా కదిలించి వేస్తుంది. 

ఆర్టీసీపై తేల్చేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల్లో కొందరికి విఆర్ఎస్ ఇవ్వాలని కెసిఆర్ సర్కారు ఆలోచనలో ఉంది. కేసీఆర్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఆర్థికంగా మాత్రం తెలంగాణ రాష్ట్ర ఖజానాకు చిల్లుపెట్టేదిలా ఉంది. 

Also read: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ నిర్ణయం ఇదే: తేలనున్న కార్మికుల భవితవ్యం

ఒక అంచనా ప్రకారం ఆర్థికంగా ఇప్పటికే రాబడులు తగ్గి ఒకింత కష్టాల్లో ఉన్న రాష్ట్రంపై ఈ నిర్ణయం వల్ల అదనంగా మరో  2,400కోట్ల భారం పడనుంది. గురువారం రోజు జరిగే కాబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

సగం రూట్లను ప్రైవేటీకరించినందున సగం మంది కార్మికులకు విఆర్ఎస్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. 

ఈ ప్యాకేజీ కార్మికులను ఆకట్టుకునేలా ఉండేందుకు ఒక్కో కార్మికుడికి 10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇలా గనుక చూసుకుంటే,మొత్తంగా 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అవనున్నట్టు తెలుస్తుంది. 

ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్యాకేజీ విషయం గురించి ఎంత ప్రశ్నించినప్పటికీ నోరు మాత్రం మెదపడం లేదు. ఈ విషయం గురించి బయటకు పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నారు. ఆర్టీసీ అధికారులకు కూడా ఈ విషయమై మౌనంగా ఉండమని ఆదేశాలు అందినట్టు సమాచారం. 

ఇక నిన్న పార్లమెంటులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆర్టీసీ సమస్యపై పార్లమెంటులో గళమెత్తారు. ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకొని ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలనీ రేవంత్ కోరారు.

Also read: ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ కు ఫోన్ చేసిన నితిన్ గడ్కరీ

52 రోజుల సమ్మెను కార్మికులు విరమించినప్పటికీ ప్రభుత్వం వారిని తిరిగి చేర్చుకోవడం లేదని, కనీసం వారితోనే చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని కార్మికుల, వారి కుటుంబాలను రక్షించాలని ఆయన అన్నారు. 

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే తాము కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామని ఆయన స్పందిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ కు కొన్ని సూచనలు చేసారని, అవి ఏంటి అనేది తాను చెప్పలేను కానీ, ఖచ్చితంగా కేసీఆర్ కు కొన్ని సూచనలను మాత్రం కేంద్రం చేసిందని చెప్పుకొచ్చారు.