హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సమ్మెపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. నితిన్ గడ్కరీ కేసీఆర్ కు ఫోన్ చేసి ఆర్టీసీ సమ్మెపై మాట్లాడినట్లు సమాచారం.

సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని గడ్కరీ కేసీఆర్ కు సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీలు ఇటీవల గడ్కరీని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ సందర్భంలోనే గడ్కరీ కేసీఆర్ కు ఫోన్ చేశారు. అయితే, కేసీఆర్ అందుబాటులోకి రాలేదు.

Also Read: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ నిర్ణయం ఇదే: తేలనున్న కార్మికుల భవితవ్యం

ఆ తర్వాత కేసీఆర్ కు ఆయన ఫోన్ చేసి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని సూచించినట్లు చెబుతున్నారు. నితిన్ గడ్కరీ కేసీఆర్ కు పరిష్కార మార్గాలను ఏం సూచించారనేది తెలియదు.

సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ యూనియన్ నేతలు ప్రకటించినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదు. వారిని విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. ఈ స్థితిలో కేసీఆర్ గురు, శుక్రవారాల్లో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Also Read: ప్రతిపాదనలు రెడీ: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రానికి కేసీఆర్ లేఖ

మంత్రివర్గ సమావేశంలో ఆయన ఆర్టీసీ భవితవ్యాన్ని తేల్చే అవకాశాలున్నాయి. ఆర్టీసీలో సగం రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తానని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కార్మికులకు విఆర్ఎస్ అవకాశం ఇచ్చి రూట్లను ప్రైవేటీకరించాలని ఆయన చూస్తున్నారు.