హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) భవితవ్యంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడో రేపో తేల్చనున్నారు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి అనుమతిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే, షరతులపై ఆయన అందుకు అనుమతిస్తారని అంటున్నారు. 

భవిష్యత్తులో సమ్మెలో పాల్గొనబోమనే హామీ పత్రం రాయించుకుని ఆయన కార్మికులను విధుల్లోకి అనుమతిస్తారని అంటున్నారు. కేసీఆర్ ఆధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం ఆ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read: మెట్టుదిగని కేసీఆర్.. ఆర్టీసీ జేఏసీ చివరి ఆశలు వారిపైనే...

అదే సమయంలో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు .ఆర్టీసీ కార్మికులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం 1967లో దేశవ్యాప్తంగా అన్ని రూట్లను జాతీయం చేస్తూ నిర్ణయం తీసుకుని, వాటిని సంబంధిత రాష్ట్రాల ఆర్టీసీలకు అప్పగించింది. దాంతో ఆర్టీసీ రూట్లను డీనోటిఫై చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇటీవలి భేటీలో గవర్నర్ తమిళిసైకి ఆ విషయం చెప్పినట్లు సమాచారం.

Also Read: ప్రతిపాదనలు రెడీ: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రానికి కేసీఆర్ లేఖ

కొన్ని ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే ఆర్టీసీకి, ప్రైవేట్ ఆపరేటర్లకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుందని, దానివల్ల ప్రజలకు ఉత్తమ రవాణా సౌకర్యం లభిస్తుందని కేసీఆర్ తమిళిసైకి చెప్పినట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీ కార్మికుల్లో 12 వేల మంది కార్మికుల వయస్సు 50 ఏళ్లు దాటిందని, వారంతా వీఆర్ఎస్ కు సిద్ధంగా ఉండే అవకాశం ఉందని మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.