హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్‌తో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ మంగళవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.

ఈ నెల 19వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల కాపీ అందలేదనే కారణంగా ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చించలేదు.

ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాలపై  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై చర్చిస్తోంది. ఆర్టీసీ కార్మికులకు ఈనెల 21వ తేదీలోపుగా  సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు  జారీ చేసింది.

ఈ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేయలేదని గవర్నర్‌కు  జేఎసీ నేతలు ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదు చేసిన మరునాడే సీఎం కేసీఆర్  ఆర్టీసీ అధికారులు,  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో సమావేశమయ్యారు.

ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేయాలని  తెలంగాణ జేఎసీ, రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఈ నెల  30వ తేదీ వరకు పలు రకాల నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఆర్టీసీ జేఎసీ నిర్ణయం తీసుకొంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ జేఎసీ నేతలు, రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్టీసీ జేఎసీ నేతలకు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి.

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వంతో  చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని కూడ ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావును కోరారు. కేశవరావు కూడ సానుకూలంగా స్పందించారు.

కానీ, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా లేరని స్పష్టమౌతోందని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు. చర్చల విషయమై కేశవరావు ముందుకు వచ్చిన కూడ ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించకపోవడంపై ఆర్టీసీ జేఎసీ నేతలు మండిపడుతున్నారు.

ఈ పరిణామాలను ఆర్టీసీ జేఎసీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల గవర్నర్ సౌందరరాజన్ సానుభూతిని ప్రకటించారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడ ఆత్మహత్యలు చేసుకోకూడదని సూచించారు. ప్రభుత్వంతో తాను మాట్లాడుతానని కూడ ఆమె చెప్పారు.ఈ పరిణామాలపై ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారోననేది ఆసక్తి నెలకొంది.


read also:జీతాల చెల్లింపుపై చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం...

read also కేసీఆర్ మొండిపట్టు, జేఎసీ నేతలకు తమిళిసై దిక్కు...

read also  అమ్మా చొరవచూపండి: గవర్నర్ తమిళసైతో టీఎస్ఆర్టీసీ జేఏసీ భేటీ...